ఆ మధ్య ఒక కవి తెలుగు వాళ్ల మీద ఒక సెటైర్ రాసి అందరిని ఔరా, నిజమే కదా, అనిపించేలా చేశాడు.
ఇవే పాదాలు కాదు కాని, అర్థం ఇదే… తెలుగు వాళ్లకి.. దేశమంటే అమెరికా, కరెన్సీఅంటే డాలర్, ఆట క్రికెట్…
అందుకే తెలుగు వాళ్లలో అమెరికా కల ఎక్కువ. ఈ మధ్య నాకు తెలిసిన అమ్మాయి చక్కటి ఐటి హైదరాబాద్ ఉద్యోగం వదిలేసి అమెరికా యూనివర్శిటీలో ఎమ్మెస్ కోసం అడ్మిషన్ తెచ్చుకుని వెళ్లిపోయింది. ఇపుడు అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ ఏజంట్ల చేతిలో చిక్కిన విద్యార్థుల జాబితాలో ఆమె పేరుందేమోనని భయంగా కూడా ఉంది.
ఇలా ఇండియా నుంచి చాలా మంది విద్యార్థులు ఫేక్ యూనివర్శిటీలలో చేరి స్టుడెంట్ వీసా పొందుతున్నారు. అనుమానాస్పద విశ్వవిద్యాలయాల గురించి కనీసం వాకబు కూడా చేయడం లేదు. ఎందుకు చేయడం లేదంటే, వీళ్లెవరూ చదువుకోవడానికి అక్కడికి వెళ్లడం లేదు. స్టుడెంట్ వీసా కోసం ఫేక్ సంస్థల్లో చేరుతున్నారు. అక్కడ వర్క్అథరైజేషేర్ తీసుకుని ఏదో ఒక ఉద్యోగంలో చేరి అక్కడే ఉండిపోతున్నారు. అందుకే వీళ్లెవరూ ఆ యూనివర్శిటీ ఉందా లేదా, ఎవరూ నడిపిస్తున్నారనే విషయాలను వాకబు చేయడం లేదు. డబ్బు పడేస్తున్నారు, అడ్మిషన్ కొంటున్నారు. ఇలాంటి వాళ్ల కోసం తెలుగు రిక్రూటర్లు తయారయ్యారు. వాళ్లు కోట్లు సంపాదిస్తున్నారు.
ఇపుడు యుఎస్ లో అరెస్టయిన 8 మంది తెలుగు యువకులు ఫార్మింగ్టన్ యూనివర్శిటీ మాయలో ఎలా పడ్డారో చూద్దాం.
ఫార్మింగ్టన్ విశ్వవిద్యాలయం అనేది అక్రమంగా అమెరికాలో ప్రవేశించాలనుకుంటున్న ఆశాజీవులను పట్టుకునేందుకు పెట్టిన బోగస్ విశ్వవిద్యాలయం. ఇదే స్టింగ్ ఆపరేషన్. కేవలం భారతీయుల కోసం మొదలయిన స్టింగ్. అంతా అన్ని శాఖ లసహకారంతో అధికారులే సృష్టించిన స్టింగ్ ఆపరేషన్ విశ్వవిద్యాలయం ఇది. అరోస్టు తర్వాత మూసేశారు.
దీనికి బోర్డు తప్ప మరొకటి లేదు. క్లాస్ రూం లేవు, కోర్సులు లేవు. రిక్రూటర్లకు కూడ ఇలాంటివి డీటైల్స్ అవసరం లేదు. అందుకే తెలుగు గ్యాంగ్ 600 మంది విద్యార్థులను పార్మింగ్టన్ విశ్వవిద్యాలయంలో ఈజీగా చేర్పించారు. వీరు ఒక్కొక్కరి దగ్గిర నుంచి 20 వేల అమెరికన్ డాలర్లు వసూలు చేశారని అధికారులు చెబుతున్నారు. ఇలా ఎంత డబ్బు వసూలు చేశారో చూడండి. కొద్ది రోజుల తర్వాత వీళ్ళు ఆంధ్ర తెలంగాణల్లో రాయితీలు కొట్టి పెట్టుబడులు పెట్టే వారే. వీరే ఎన్ ఆర్ ఐ ప్రముఖులయ్యే వారు. పత్రికలు తెలుగు తేజం అని రాసేవి. అయితే, కథ అడ్డం తిరిగింది. సరే మొదటి కొద్దాం.
ఒక్క బుధవారం నాడే, తెలుగు గ్యాంగ్ అందించిన వివరాలతో 130 మంది ఫార్మింగ్టన్ విశ్వవిద్యాలయం విద్యార్థులను అరెస్టు చేశారు. ఈ విద్యార్థులందరికి ఈ విశ్వవిద్యాలయం బోగస్ అని, చట్టవ్యతిరేకం అని, పట్టుబడితే ఇండియాకు తరిమేస్తారని కూడా తెలుసు. అయినాసరే, అమెరికా కల, డాలర్ మాయ వాళ్లని దేనికైనా తెగించేలా చేసింది.
యూనివర్శటి ఆఫ్ ఫార్మింగ్టన్ అనేది అధికారుల సృష్టి అని చెప్పుకున్నాం కదా. ఇందులో యావత్తు కల్పితమే. ఉదాహరణకు యూనివర్శిటీ ప్రెశిడెంట్ పేరును కూడా సృష్టించారు. ఆయన పేరు డాక్టర్ అలి మిలాని. యూనివర్శిటీ స్టేట్ బిజినెస్ ఫైలింగ్స్ లో మాత్రమే ఈయన పేరుకనబడుతుంది. ఆయన ఎవరో , ఎక్కడుంటారో, ఆస్తులేమిటో, ఆయన అకడెమిక్ బ్యాక్ గ్రౌండ్ ఏమిటో,ఆయన బంధువులెవరో కూడా తెలియదు. అంతేకాదు, పబ్లిక్ రికార్డ్స్ డేటా బేస్ ప్రకారం ఆయన అమెరికాలో ఎపుడూ ఓటేసిన దాఖలా కూడా లేదు.యూనివర్శిటీ వెల్లడించిన అయిదుగురు అధికార్లలో ఆయన ఒకరు. ఇక యూనివర్శిటీ ట్రెజరర్ ను తీసుకుందాం. ఆయన పేరు ఒమర్ పార్శి. నేషనల్ పబ్లిక్ రికార్డ్స్ లో ఈ పేరే ఎక్కడా కనిపించదు. ఈ రెండు పేర్ల ను చూస్తే ఈ విశ్వవిద్యాలయం ఇండియా నుంచి వస్తున్న బోగస్ విద్యార్థుల కోసమే ఏర్పాటు చేసిన సంస్థలాగా కనిపిస్తుంది. ఇండియావాళ్లకు పరిచయం ఉన్న పేర్లలాగా కనిపిస్తాయి. న్యూజెర్సీలో కూడాఅధికారులు ఇలాంటి స్టింగ్ ఆపరేషన్ చేశారు. అక్కడి విశ్వవిద్యాలయం ప్రెశిడెంట్ పేరు డాక్టర్ స్టీవెన్ బ్రూనెటి. ఇదీ బోగస్ పేరే.
యూనివర్శటీ ఆఫ్ ఫార్మింగ్టన్ మొదటి సారి నవంబర్ 2015 బిజినెస్ ఫైలింగ్స్ తో ఉనికిలోకి వచ్చింది. ఇది ఇంటర్నేషన్ స్కూల్ ఆఫ్ మిచిగన్ అనే మరొక (బోగస్) సంస్థ కు సంబంధించిందని ప్రచారం చేసుకున్నారు.
అపుడు ఈ విశ్వవిద్యాలయం చూపించిన అడ్రసు ఏమిటో తెలుసా? అదొక యుపిఎస్ స్టోర్. ఈ ఫేక్ విశ్వవిద్యాలయాన్ని అధికారులు చాలా పకడ్బందీ గా ఏర్పాటు చేశారు. 2015 నవంబర్ లో మిచిగన్ లో బిజినెస్ చేసుకునేందుకు అనుమతినీయాలని విశ్వవిద్యాలయం స్టేట్ డిపార్ట్ మెంటు ఆఫ్ లైసెన్సింగ్ అండ్ రెగ్యులేటరీ ఎఫైర్స్ ని కోరారు. అనుమతి వచ్చింది. అంతేకాదు, తొందర్లోనే యూనివర్శిటీ ఆఫ్ ఫార్మింగ్టన్ అధికారులకు హౌసింగ్, యూనివర్శిటీ అడ్డినిస్ట్రేషన్ వసతులు, ల్యాబ్స్, లైబ్రరీ, టీచింగ్ వంటి సౌకర్యాలు కల్పిస్తామని ఈ శాఖని ఒప్పించారు. ఇలా విశ్వవిద్యాలయం హామీ ఇచ్చినట్లు స్టేట్ డిపార్ట్ మెంటు ప్రకటించింది. అంటే ఇవేవీ లేకుండా పేపర్ మీద చెప్పిన హామీతో అనుమతి వచ్చింది. ఇలాంటి వి ఇండియాలో ఎక్కువగా జరుగుతుంటాయి.
ఇప్పటికీ ఈ విశ్వవిద్యాలయానికి ఏమీ లేదు. ఫార్మింగ్టన్ హిల్స్ లోని ఒక షాపింగ్ కాంప్లెక్స్ బేస్ మెంట్ లోని ఒకే ఒక గది నుంచి ఇది పనిచేస్తున్నది. అయితే, లైసెన్సింగ్ అధికారులు హోం ల్యాండ్ సెక్యూరిటీ అధికారులకు సహకరించేందుకే ఇలా అడ్రసు తప్ప మరేమీ లేని సంస్థలకు యూనివర్శిటీ నడుపుకునే లైసెన్స్ ఇచ్చినట్లు మనకు అర్థమవుతుంది.
ఫార్మింగ్టన్ విశ్వవిద్యాలయం వెబ్ సైట్ ప్రకారం దీనికి ఎక్రిడెటింగ్ కమిషన్ అఫ్ కెరీర్ స్కూల్స్ అండ్ కాలేజెస్, వర్జీనియా , గుర్తింపు (ఎక్రిడిటేషన్ ) కూడా ఉంది. హోం ల్యాండ్ సెక్యూరిటీ అధికారులు దగ్గరుండి దీనికి అక్రిడిటేషన్ తెప్పించారు. ఈ బోగస్ సంస్థ ఇండియా ముఖ్యంగా తెలుగు బ్రోకర్లను ఆకట్టుకునేందుకు చాలా ‘సాక్ష్యాలు’ చేశారు. అవి కూడా బోగస్సే. ఈ విశ్వవిద్యాలయం వెబ్ సైట్ లో ఉన్న విద్యార్థలు ఫోటో లు కూడా స్థానిక విద్యార్థులవి కాదు, అవి ఇంటర్నెట్ ఫోటో ఏజన్సీలు అమ్మే ఫోటోలు. ఇందులో ఒక ఫోటో షట్టర్ స్టాక్ నుంచి తీసుకున్నారని డెట్రాయిట్ న్యూస్ బయటపెట్టింది. అమెరికా డ్రీమ్ చేజర్స్ ని ఇంకా బాగా నమ్మించేందుకు వచ్చే వారం విశ్వవిద్యాలయంలో జరిగే కార్యక్రమాలంటే బోగస్ ఫాకల్టీ పేర్లతో క్యాలెండర్ కూడా విడుదల చేశారు.తెలుగు గ్యాంగ్ వంటి బ్రోకర్లను ఇవేవీ అవసరం లేదు కదా. అరెస్టయిన రిక్రూటర్లంతా తెలుగు వాళ్ళే. తెలుగు గ్యాంగ్ ల మీద నిఘా వుందన్న మాట. తెలుగోళ్లూ జాగ్రత్త.