తెలంగాణ: మంచిరెడ్డి కిషన్ రెడ్డికి సొంత నియోజకవర్గంలో నిరసన సెగ తగిలింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడపల్లిలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. మేడిపల్లి గ్రామంలో చెరువు నిండటంతో పూజలు చేసేందుకు ఆయన వచ్చారు. అయితే ఈ సందర్బంగా స్థానికులు ఆయనను నిలదీసే ప్రయత్నం చేశారు. ఫార్మాసిటీ కారణంగా భూములు కోల్పోతే పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు కొందరిపై లాఠీఛార్జ్ చేశారు. దీంతో గ్రామస్థులు మరింతగా ఆగ్రహానికి లోనయ్యారు.
ఎమ్మెల్యే కాన్వాయ్‌పై రాళ్లు, చెప్పులు విసిరారు. మేడిపల్లి గ్రామం ఫార్మాసిటీలో పోతుందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు ఎమ్మెల్యేనే కారణమంటూ గ్రామస్థుల నిరసన తెలిపారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి తమ గ్రామంలోకి రావొద్దంటూ గ్రామస్థులు ర్యాలీ నిర్వహించారు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళన చేస్తున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రంగారెడ్డి జిల్లాలోని యాచారం, కందుకూరు మండలాల మధ్య ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణను మరింత ముమ్మరం చేసింది. 19,333 ఎకరాలు సేకరణ లక్ష్యం కాగా, ఇప్పటివరకు 10,490 ఎకరాలు సేకరించింది. మరో 8,843 ఎకరాలు సేకరించాల్సివుంది. అయితే మేడిపల్లిలో తమ పట్టాభూములు ఇవ్వబోమని తహసీల్దారుతో కొందరు గొడవకు దిగారు. రైతులు తమ భూములు ఇస్తామని రెవెన్యూ అధికారులకు కాన్సెంట్ ఇచ్చారు. కాగా, పట్టాభూములు ఇవ్వని రైతుల పంటపొలం వివరాలు ఆరాతీసి కోర్టులో డబ్బు డిపాజిట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
అసెన్డ్ భూములకు రూ.8 లక్షలు, పట్టా భూములకు రూ.12.50లక్షలు పరిహారం ఇచ్చారు. ఇందులో అసైన్డ్ భూములిచ్చిన రైతులకు ఇప్పుడు 120గజాల ప్లాటు మాత్రమే ఇస్తామని మంత్రులు ప్రకటించారు. ప్రస్తుతం ఈ రెండు మండలాల పరిధిలో అసైన్డ్ భూముల సేకరణ పూర్తవడంతో, ప్రస్తుతం పట్టా భూముల సేకరణ జరుగుతోంది. యాచారం మండలంలోని తాడిపర్తిలో 400 మంది రైతుల నుంచి 1500 ఎకరాలు, కుర్మిద్దలో 400 మంది రైతుల నుంచి 1500, నానక్‌నగర్‌లో 200 మంది రైతుల నుంచి 690, మేడిపల్లిలో 450 మంది రైతుల నుంచి 1100 ఎకరాల పట్టా భూముల సేకరణకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.