టిఆర్ ఎస్ పార్టీలో హరిష్ రావు అనుచరుడిగా ముద్రపడ్డ వ్యక్తి పై వేటు పడింది. బుజ్జగింపులకు లొంగకపోవడంతో పార్టీ నాయకత్వం వేటు నిర్ణయం తీసుకుంది. రెబల్ గా బరిలోకి దిగాలనుకున్న నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి చెందిన టిఆర్ ఎస్ నేత వేనేపల్లి వెంకటే శ్వరరావును పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు పార్టీ సాధారణ కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వేనేపల్లి వెంకటేశ్వరరావు మంత్రి హరీష్ రావుకి అత్యంత సన్నిహితుడు. ఇటీవల హరీష్ రావుకి, కేసీఆర్ కి సంబంధాలు దూరమవుతున్నాయని వార్తులు వస్తున్న నేపథ్యంలో వెంకటేశ్వరరావు పై వేటు సంచనం రేపుతోంది.
వేనేపల్లి వెంకటేశ్వరరావుకి మునుగోడు నియోజకవర్గంలో మంచి పేరుంది. ఆయన టిఆర్ ఎస్ లో చేరినప్పటి నుంచి కూడా పార్టీ కార్యక్రమాలన్నింటిలో కూడా చురుకుగా పాల్గొంటున్నాడు. మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తీరును మాత్రం వేనేపల్లి ఆది నుంచి వ్యతిరేకిస్తున్నాడు. ఆయన ప్రవర్తనతో పార్టీ భ్రష్టు పడుతుందని గతంలో మంత్రి హారీష్ రావుకు బహిరంగ లేఖ కూడా రాశాడు.
వేనేపల్లి అనుచరులలో అధికంగా సర్పంచ్ లు, ఎంపీపీలు ఉన్నారు. కూసుకుంట్ల మీద ఉన్న వ్యతిరేకతతో ఈ ఎన్నికలలో టికెట్ వస్తుందని వేనేపల్లి ఆశించారు. కానీ సీఎం కేసీఆర్ సిట్టింగ్ లకే స్థానాలు ప్రకటించడంతో వేనేపల్లి ఆశలు గల్లంతయ్యాయి. దీంతో తాను రెబల్ గానైనా పోటి చేస్తానని వెంకటేశ్వరరావు ఏర్పాట్లలో ఉన్నాడు. దీంతో వివాదం ముదిరింది. వేనేపల్లి ఇప్పటికే తన ప్రచారాన్ని కూడా ప్రారంభించాడు. దీంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని వేనేపల్లిని సస్పెండ్ చేస్తూ టిఆర్ ఎస్ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది.

వేనేపల్లి వెంకటేశ్వరరావు మునుగోడులోని 3 మండలాలను బలంగా ప్రభావితం చేయగలడని టిఆర్ ఎస్ నేతలే భావిస్తున్నారు. మునుగోడు, నాంపల్లి, చండూరు మండలాల్లో వేనేపల్లికి మంచి మద్దతు ఉందని చర్చ ఉంది. దీంతో వేనేపల్లి బహిష్కరణ పార్టీకి నష్టమేనని వారు అంచనా వేస్తున్నారు. వేనేపల్లి మీద చర్య ద్వారా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు మరింత క్లిష్టంగా మారుతుందని వారు అనుమానిస్తున్నారు. వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, అయినప్పటికి టిఆర్ ఎస్ నాయకత్వం బహిష్కరణ నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
వేనేపల్లి బాటలోనే మరికొంత మంది నేతలపై కూడా వేటు పడే అవకాశం ఉంది. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో కూడా అసంతృప్తి ఉంది. అక్కడ అభ్యర్ధిగా ఉన్న రాజయ్య వద్దని కడియంకు అవకాశం ఇవ్వాలని నేతలు కోరుతున్నారు. కడియం తన అనుచరులతో రాగా మంత్రి కేటిఆర్ కడియంకు, రాజయ్యకు సర్ధి చెప్పి పంపారు. అయినా కూడా అక్కడి నేతలు అసంతృప్తితో ఉన్నారు. చివరి వరకు ఇలానే ఉంటే వారి పై కూడా చర్యలు తప్పవేమోనని చర్చ జరుగుతోంది.
నల్లగొండ నియోజకవర్గం నుంచి దుబ్బాక నర్సింహా రెడ్డి టికెట్ ఆశించగా అక్కడ కంచర్ల భూపాల్ రెడ్డికి టికెట్ కేటాయించడంతో వారు కూడా అసంతృప్త ర్యాలీ తీశారు. బహిరంగ సభ పెట్టి కంచర్లను వ్యతిరేకించారు. ఏమవుతుందో చూడాలని అంతా ఎదురు చూస్తున్నారు.
హైదరాబాద్ ప్రాంత నేతలు కూడా కోపంగా ఉండటంతో మంత్రి కేటిఆర్ వారందరిని బుజ్జగింపుల పర్వం చేస్తున్నారు. అలాగే ఎవరైనా నాయకులు మాట వినకపోతే నష్టం ఏమి లేదని వారంత నిరభ్యరంతంగా వెళ్లి పోయినా నష్టం లేదని కేసీఆర్ సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చారు.
