జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అగ్రనేత రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తమ పార్టీ 30 వేల మెజారిటీతో గెలవబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రెహమత్ నగర్ డివిజన్లోని ఎస్ పీఆర్ హిల్స్ నుంచి హబీబ్ ఫాతిమానగర్ వరకు నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న సీఎం రేవంత్, ప్రధాన ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
బీఆర్ఎస్-బీజేపీ విలీనంపై సంచలన జోస్యం: సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీల లోపాయికారీ ఒప్పందాలపై సంచలన జోస్యం చెప్పారు. “బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతోంది. కారు దిల్లీకి చేరగానే కమలంగా మారుతోంది” అని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
“జూబ్లీహిల్స్‌లో 30 వేల మెజారిటీతో గెలవబోతున్నాం.” “ఇంటి నుంచి గెంటేశారని కవిత రాష్ట్రం మొత్తం తిరుగుతున్నారు. సొంత చెల్లికే న్యాయం చేయలేని కేటీఆర్… మీకు న్యాయం చేస్తారా?” ఫార్ములా ఈ రేసు కేసులో రూ. 50 కోట్ల అవినీతి జరిగిందని, కేటీఆర్ అరెస్ట్‌కు గవర్నర్ అనుమతి ఇవ్వకపోవడం ‘లోపాయికారీ ఒప్పందం’ కాదా అని ప్రశ్నించారు.

కాళేశ్వరం కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై బీజేపీ వైఖరిని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. మోదీ, అమిత్ షా రూ. లక్షలు కొల్లగొట్టారని చెబుతున్నప్పటికీ, కేంద్రం ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.
“బీఆర్ఎస్ కు బీజేపీ లొంగకపోతే తక్షణమే కాళేశ్వరం ప్రాజెక్ట్ పై సీబీఐ చేత విచారణ చేపట్టాలి. ఈ నెల 11 లోగా కేసీఆర్, హరీష్‌లను అరెస్ట్ చేయాలి. అలా జరగకపోతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్కు బీజేపీ మద్దతు ఇస్తున్నట్లేనని స్పష్టమవుతుంది” అని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

