Harish Rao Satirical Comments: కాళేశ్వరంపై మాటల యుద్ధం.. హరీష్ రావు గట్టి కౌంటర్

కాళేశ్వరం ప్రాజెక్టుపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు.

ఎక్స్‌ వేదికగా హరీష్ రావు చేసిన ట్వీట్‌లో, ‘మేడిగడ్డ టు మల్లన్న సాగర్ – మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు రూ. 84,000 కోట్లు అయితే.. జస్ట్ తమ్మిడి హెట్టి టు ఎల్లంపల్లి కి రూ. 35,000 వేల కోట్లట! కాళేశ్వరం పథకంతో 37 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలనేది లక్ష్యం అయితే, ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుతో కేవలం 4.47 లక్షల ఎకరాలకే సాగు నీరట!’ అంటూ ఎద్దేవా చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు (మేడిగడ్డ నుండి మల్లన్న సాగర్ వరకు) మొత్తం ఖర్చు రూ. 84,000 కోట్లు కాగా, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో కేవలం తమ్మిడి హెట్టి నుండి ఎల్లంపల్లి వరకు రూ. 35,000 కోట్లు ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. కాళేశ్వరంలో నీటి వినియోగం 240 TMC అయితే, ప్రాణహిత-చేవెళ్లలో కేవలం 80 TMC మాత్రమేనని తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టు 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో రూపొందించబడిందని, కానీ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుతో కేవలం 4.47 లక్షల ఎకరాలకు మాత్రమే సాగు నీరు అందిస్తారని విమర్శించారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టుతో పోల్చితే మూడో వంతు ఖర్చు చేస్తూ, పదోవంతు ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వరట! 35 వేల కోట్లు ఖర్చు చేసి, కేవలం 4.47 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలనే ఆలోచన అద్భుతం. అమోఘం. కాంగ్రెస్ ప్రభుత్వ ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఇది మరో నిదర్శనం. ఇది కదా అసలైన మార్పంటే?’ అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అవినీతిమయం అంటూ అధికార పక్షం కాంగ్రెస్ ఆరోపిస్తుండగా, తమ హయాంలో ఎలాంటి అవినీతి జరగలేదని బీఆర్‌ఎస్ పార్టీ స్పష్టం చేస్తోంది. ఈ క్రమంలో, హరీష్ రావు వ్యాఖ్యలు అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల పోరును మరింత తీవ్రతరం చేశాయి.

Govt Medical Colleges Privatization: Public Reaction | Kutami Govt | Telugu Rajyam