కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శన భాగ్యం సామాన్యులకు కష్టంగా మారుతోంది. మంత్రులు, అధికార పార్టీకి చెందిన నేతలు.. పెద్ద సంఖ్యలో అనుచరుల్ని వెంటేసుకుని దర్శనాలకు వెళుతున్నారు. 300 రూపాయల టిక్కెట్ కొనుక్కుంటే ఎవరైనా దర్శనం చేసుకోవడానికి వెసులుబాటు వుంది. కానీ, సామాన్యుడి పరిస్థితేంటి.? 300 రూపాయల టిక్కెట్ కొనుక్కుని వెంకన్నను దర్శనం చేసుకుంటే కరోనా వైరస్ రాదు.. ఉచిత దర్శనం ద్వారా వెళితే కరోనా వస్తుందా.? అందుకే, ఉచిత దర్శనాన్ని ఆపేశారా.? అన్న చర్చ సామాన్యుల్లో జరుగుతోంది. నిజమే మరి, 300 రూపాయల టిక్కెట్ విషయంలో ఎలాగైతే ఆన్‌లైన్ అవకాశం కల్పిస్తున్నారో, అదే పద్ధతి ఉచిత దర్శనానికీ అనుమతిస్తే.. ఉచితంగా దర్శనం చేసుకునేవారూ ఆన్‌లైన్ విధానంలో తమ స్లాట్ బుక్ చేసుకుని, వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు కదా.?
‘నా వరకూ నేను సామాన్య భక్తులకు వెంకన్న దర్శనం లభించాలనే కోరుకుంటున్నాను. కానీ, పరిస్థితులు అనుకూలించడంలేదు..’ అంటూ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తాజాగా సెలవిచ్చారు. కానీ, ఆయన మాటల్లో ఒకింత నిర్లిప్తత స్పష్టంగా కనిపిస్తోంది. ఓ ఐదుగురు సభ్యులున్న కుటుంబం వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలంటే దర్శనం టిక్కెట్లకే 1500 రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి రావడం ఎంత బాధాకరం. అసలు దేవాలయాల్లో ఈ టిక్కెట్ల గోల ఎందుకు.? అన్న ప్రశ్న చాలాకాలంగా వినిపిస్తోంది. కేవలం హిందూ దేవాలయాలకే ఈ టిక్కెట్ల పైత్యం తప్ప.. చర్చిలకుగానీ, మసీదులకుగానీ ఎలాంటి టిక్కెట్లూ అవసరం లేదు. అదేంటో.. అధికారంలో ఎవరున్నా, హిందూ భక్తుల పట్ల కనీసపాటి కనికరం చూపలేకపోతున్నారు.