మగవారికి వేగంగా పెరుగుతున్న ప్రమాదం ఇదే.. నిపుణుల షాకింగ్ హెచ్చరిక..!

మగవారి ఆరోగ్యంపై నిస్సారంగా దాడి చేసే నిశ్శబ్ద శత్రువుగా ప్రొస్టేట్ క్యాన్సర్.. ఇది ప్రపంచవ్యాప్తంగా భయానక స్థాయిలో పెరుగుతోంది. ప్రొస్టేట్ గ్రంథి చిన్నదైనా, అది పునరుత్పత్తి వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ గ్రంథిలో ఏర్పడే క్యాన్సర్ ఎక్కువసార్లు స్పష్టమైన లక్షణాలు లేకుండానే మొదలవడం అత్యంత ప్రమాదకర అంశంగా మారుతోంది. లక్షణాలు కనిపించే నాటికి వ్యాధి తరచుగా ముందుకు సాగిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రొస్టేట్ క్యాన్సర్‌పై తాజా అవగాహన, చికిత్సా మార్గాలు, ఆధునిక వైద్య పురోగతులపై వైద్యులు వివరాలు అందించారు.

ఈ వ్యాధి మొదలయ్యే మొదటి సంకేతాలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి.. మూత్ర విసర్జన సమయంలో బలహీనమైన ప్రవాహం, తరచూ మూత్రం రావడం, రాత్రిపూట ఎక్కువసార్లు లేచి బాత్రూమ్‌కు వెళ్లడం, మూత్రాన్ని పూర్తిగా తీయలేకపోవడం వంటి సమస్యలు. కొన్నిసార్లు మూత్రంలో రక్తం, నడుము నొప్పి, ఆకస్మికంగా బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఈ లక్షణాలన్నింటిని కలిపి లోయర్ యూరినరీ ట్రాక్ట్ సింప్టమ్స్ (LUTS)గా గుర్తిస్తారు. అయితే ప్రతి రోగికి ఇవన్నీ కనిపించవు.. కొన్ని సందర్భాల్లో ఏ లక్షణాలు లేకుండానే క్యాన్సర్ ముందుకు దూసుకుపోవడం ప్రధాన సమస్యగా వైద్యులు చెబుతున్నారు.

ప్రొస్టేట్ అసహజంగా ఉందా లేదా అనేది గుర్తించేందుకు మొదట వైద్యులు డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్‌ను సూచిస్తారు. ప్రొస్టేట్ ఆకారం, దృఢత్వం, అసమానతలను ఈ పరీక్ష ద్వారా అంచనా వేస్తారు. అనుమానం ఉన్న వెంటనే మల్టీ పారామెట్రిక్ MRI చేస్తారు. ఈ MRIలో వచ్చే PIRADS స్కోర్ ఆధారంగా క్యాన్సర్ ప్రమాద స్థాయి లెక్కించబడుతుంది. వ్యాధి నిర్ధారణకు బయాప్సీ కీలకం. తదుపరి దశలో PSMA PET-CT స్కాన్ ద్వారా వ్యాధి ఏ దశలో ఉందో స్పష్టంగా తెలుసుకుంటారు.. ప్రొస్టేట్‌కు మాత్రమే పరిమితమై ఉన్న లోకలైజ్డ్ స్టేజ్ నుంచి ఎముకలు, ఇతర అవయవాలకు వ్యాపించే మెటాస్టాటిక్ స్టేజ్ వరకు నాలుగు దశలుగా వర్గీకరిస్తారు.

చికిత్స విషయంలో ఒకే రకం నిర్ణయం ఉండదు. పేషెంట్ వయసు, స్టేజ్, లక్షణాలు, ఇతర ఆరోగ్య సమస్యలు కలిపి నిర్ణయం తీసుకుంటారు. తొలిదశలో ఉంటే యాక్టివ్ సర్వైలెన్స్, రాడికల్ ప్రోస్టేటెక్టమీ లేదా రేడియేషన్ థెరపీ అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తాయి. వ్యాధి లోకల్లీ అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లోకి వెళ్లినప్పుడు హార్మోన్ థెరపీని కూడా చికిత్సలో భాగం చేస్తారు. నోడల్, మెటాస్టాటిక్ దశలలో కీమోథెరపీ, దీర్ఘకాలిక హార్మోన్ ట్రీట్‌మెంట్ వంటి అధునాతన పద్ధతులు తప్పనిసరి అవుతాయి.

ఇటీవలి కాలంలో ప్రొస్టేట్ క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక పురోగతులు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా రొబోటిక్ అసిస్టెడ్ రాడికల్ ప్రోస్టేటెక్టమీ శస్త్రచికిత్స క్యాన్సర్ తొలగింపులో అత్యంత కచ్చితమైన పద్ధతిగా నిలుస్తోంది. రక్త నష్టం తక్కువగా ఉండటం, రికవరీ వేగంగా జరగడం, లైంగిక సమస్యలు తక్కువగా వచ్చే అవకాశం ఉండటం దీని ప్రత్యేకత. అదనంగా రొబోటిక్ రేడియో సర్జరీ, రేడియోలిగాండ్ థెరపీ, PARP ఇన్హిబిటర్స్, ఇమ్యునోథెరపీ, జీన్ ప్రొఫైలింగ్ వంటి ఆధునిక చికిత్సా ఎంపికలు రోగుల జీవిత కాలాన్ని గణనీయంగా పెంచుతున్నాయని నిపుణులు తెలిపారు.

ప్రొస్టేట్ క్యాన్సర్‌ను ప్రారంభ దశల్లో గుర్తిస్తే చికిత్స అత్యంత ప్రభావవంతంగా ఉండటం వైద్య రంగం ప్రత్యేకంగా చెబుతోంది. అందుకే నిపుణుల సూచన ఇదొక్కటే.. లక్షణాలు చిన్నవైనా నిర్లక్ష్యం చేయకూడదు, ముఖ్యంగా 50 ఏళ్ల తర్వాత మాత్రం రెగ్యులర్ స్క్రీనింగ్ తప్పనిసరి.