Tirumala: తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్.. ఆ నడక మార్గం మూసివేత.. ఎందుకంటే..?

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం ప్రతి రోజూ వేలాదిగా భక్తులు పాదయాత్రగా ఏడుకొండలు ఎక్కుతున్నారు. అలిపిరి, శ్రీవారి మెట్టుమార్గాల ద్వారా భక్తుల రాకపోకలు సాధారణంగానే కొనసాగుతున్నప్పటికీ.. మరో ప్రసిద్ధమైన నడక మార్గం అన్నమయ్య కాలిబాట మాత్రం ప్రస్తుతం పూర్తిగా మూసివేశారు.

శేషాచలం అటవీ ప్రాంతం గుండా వెళ్లే ఈ కాలిబాటలో ఇటీవల వన్యప్రాణుల కదలికలు తీవ్రంగా పెరిగినట్టు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. రాజంపేట జిల్లా అటవీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఎస్పీ ధీరజ్ కునిబిల్లి, జిల్లా అటవీ అధికారి జగన్నాథ్ సింగ్ కీలక విషయాలను వెల్లడించారు. కుక్కల దొడ్డి సమీపంలోని అటవీ ప్రాంతంలో తాజాగా 15 ఏనుగుల గుంపు సంచారం సీసీ కెమెరాల్లో రికార్డయిందని తెలిపారు. దీనితో పాటు పులులు, ఎలుగుబంట్ల కదలికలు కూడా అక్కడ ఎక్కువగా ఉన్నట్టు స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో ఆ మార్గంలో పాదయాత్ర చేస్తే భక్తులకు ప్రాణాపాయం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే భక్తుల భద్రత దృష్ట్యా అన్నమయ్య కాలిబాటలో పాదయాత్రను తాత్కాలికంగా పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఎవరూ ప్రమాదాన్ని తలపెట్టవద్దని, అటవీ మార్గంలోకి అడుగుపెట్టవద్దని స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు.

అన్నమయ్య కాలిబాటలో ప్రయాణం చేయాలనుకునే భక్తులు అటవీ ప్రాంతం గుండా కాకుండా పూర్తిగా రహదారుల మీదుగా మాత్రమే ప్రయాణించాలంటూ సూచనలు చేశారు. జాతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం అటవీ ప్రాంతంలోకి అనుమతి లేకుండా ప్రవేశించడమే నేరమని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు తేల్చిచెప్పారు.

అలిపిరి, శ్రీవారి మెట్టుమార్గాల ద్వారా వెళ్లే భక్తులకు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదని, ఆ మార్గాల్లో భద్రతా ఏర్పాట్లు పటిష్ఠంగా కొనసాగుతున్నాయని అధికారులు స్పష్టం చేశారు. భక్తులు అధికారిక సూచనలను తప్పనిసరిగా పాటించి, ప్రమాదాలను ఆహ్వానించవద్దని విజ్ఞప్తి చేశారు.