టీటీడీలో ఆగని అక్రమాలు.. నిన్న నెయ్యి.. నేడు జీడిపప్పు..? భక్తుల ఆగ్రహం..!

టీటీడీపై కల్తీ నెయ్యి వివాదం కారణంగా వచ్చిన దుమారం ఇంకా చల్లారక ముందే.. మరో పెద్ద కలకలం వెలుగులోకి రావడంతో భక్తుల్లో ఆందోళన పెరిగింది. ఇప్పుడు జీడిపప్పు టెండర్ల వ్యవహారం తెరమీదకు రావడంతో, ప్రసాదాల నాణ్యతపై, ముఖ్యంగా సరఫరా వ్యవస్థపై, తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. శ్రీవారి సేవలో ఒక్క చిన్న లోపం కూడా అనుమతించరాని పరిస్థితుల్లో.. కోట్లాది భక్తుల విశ్వాసాన్ని ధృడంగా నిలబెట్టాల్సిన సంస్థలో ఇటువంటి సంఘటనలు ఎలా జరుగుతున్నాయన్న ప్రశ్నకు సమాధానం ఎవరూ చెప్పలేని స్థితి ఏర్పడింది.

సెప్టెంబర్ 3న టీటీడీ 1.20 లక్షల కిలోల జీడిపప్పు సరఫరాకు టెండర్లు పిలిచింది. చెన్నై ఆధారిత క్రిస్టీ క్వాలిటీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫంక్షనల్ అండ్ ఇన్నోవేటివ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రెండు సంస్థలు ఇందులో పాల్గొన్నాయి. ఈ టెండర్లకు కనీసం 75,000 కిలోల సరఫరా అనుభవం తప్పనిసరి. కానీ అధికారులు వీరి పత్రాలను క్యూఆర్ కోడ్‌తో స్కాన్ చేయగా.. అవి పూర్తిగా నకిలీ వే బిల్లులు అనే విషయం బయటపడింది.

నిబంధనల ప్రకారం ఈ కంపెనీలను వెంటనే డిస్క్వాలిఫై చేసి, EMD మొత్తాన్ని ఫోర్‌ఫీట్ చేసి, బ్లాక్‌లిస్ట్ చేయాలి. అదేవిధంగా విజిలెన్స్‌కు ఫిర్యాదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కానీ ఇక్కడే అసలు సంచలనం మొదలైంది. టీటీడీ అధికారులు అన్ని నిబంధనలను పక్కన పెట్టి, ఈ రెండు కంపెనీలకు వారు చెల్లించిన రూ.56 లక్షల EMD మొత్తాన్ని తిరిగి ఇచ్చేయడం ఆశ్చర్యకర నిర్ణయంగా మారింది. నకిలీ పత్రాలు సమర్పించిన సంస్థలకు ఇంత సడలింపు ఎందుకు ఇచ్చారనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఇంతటితో ఆగకుండా, ఇదే కంపెనీలకు భవిష్యత్తులో జరిగే టెండర్లలో కూడా పాల్గొనే అవకాశం ఇచ్చినట్లు వెలుగులోకి రావడం టీటీడీ వ్యవస్థలో మరింతగా అనుమానాలు రేకెత్తిస్తోంది. తాజాగా జరిగిన యాలకుల టెండర్లలో కూడా ఈ రెండు సంస్థలు పాల్గొన్నట్లు వస్తున్న సమాచారం భక్తుల్లో కలవరాన్ని కలిగిస్తోంది.

ఇప్పటికే కల్తీ నెయ్యి ప్రస్తావనతో టీటీడీ పరిపాలనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్న సమస్యల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన సమయంలో.. ఇలాంటి మరిన్ని అక్రమాలు బయటపడటం సంస్థ ప్రతిష్టను దెబ్బతీసే అంశమే కాదు, భక్తుల విశ్వాసాన్ని కూడా కదిలిస్తుంది. శ్రీవారికి సమర్పించే నైవేద్యాలు, ప్రసాదాల విషయంలో ఎలాంటి రాజీకి అవకాశం ఉండకూడదని భావించే భక్తులు, ఇటువంటి నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టీటీడీ లోపలి వ్యవస్థలో పారదర్శకత లేకపోవడం, నిబంధనలు వక్రీకరించబడటం, నకిలీ పత్రాలకు కూడా విలువ దక్కడం.. ఇవి అన్ని కలిసి పెద్ద స్థాయి విచారణ అవసరమైందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. శ్రీవారి సేవలో అక్షరం తప్పకూడదనే సందర్భంలో… అధికారులు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సంస్థ పరిపాలనపై తీవ్రమైన మచ్చ వేస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం భక్తుల్లో అసంతృప్తిని రేకెత్తిస్తుండగా, నకిలీ పత్రాలు సమర్పించిన సంస్థలకు EMD తిరిగి ఇవ్వడం వెనుక ఉన్న నిజాలు వెలుగులోకి రావాలంటూ ఒత్తిడి పెరుగుతోంది. టీటీడీ పరిపాలన క్రమబద్ధత, పారదర్శకతను కాపాడే దిశగా తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న డిమాండ్ రాష్ట్రవ్యాప్తంగా వినిపిస్తోంది.