Karthika Deepotsavam: తిరుపతిలో వేడుకగా కార్తీక దీపోత్సవం – ⁠భారీ సంఖ్యలో హాజరైన భక్తులు

తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం మైదానంలో శుక్రవారం రాత్రి అత్యంత వైభవంగా కార్తీక మహాదీపోత్సవం నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు హాజరై సామూహిక దీపారాధన చేశారు.

ముందుగా ఎస్వీ సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో మంగళ ధ్వని, తిరుమల ధర్మగిరి వేద పాఠశాల ఆగమ పండితులు శ్రీ రాఘవేంద్ర వేదస్వస్తి,దీప ప్రాశస్త్యాన్నిగురించి వివరించారు.శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారికి, శ్రీ చతుర్భుజ మహాలక్ష్మి అమ్మవారికి తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు వైఖానస ఆగమశాస్త్రబద్ధంగా విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, శ్రీనివాసర్చన నిర్వహించారు. ఎస్వీ వేద విశ్వవిద్యాలయం పండితులు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేశారు. ఆ తర్వాత అర్చక స్వాములు శ్రీ మహాలక్ష్మి పూజ చేపట్టారు.

ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో ప్రదర్శించిన “శ్రీ లక్ష్మి ఆవిర్భవం” నృత్య రూపకం భక్తులను ఆద్యంతం ఆకట్టుకుంది. భక్తులతో దీప మంత్రం మూడు సార్లు పలికిస్తూ సామూహిక లక్ష్మీ నీరాజనం సమర్పించారు. ఈ సందర్బంగా భక్తులందరూ ఒక్కసారిగా చేసిన దీపారాధనతో మైదానం వెలుగుతో నిండిపోయింది. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు గోవిందనామాలు పాడుతుండగా నక్షత్రహారతి, కుంభహారతి సమర్పించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు జి.భాను ప్రకాష్ రెడ్డి, జేఈవో వి. వీరబ్రహ్మం దంపతులు, తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకులలో ఒకరు ఆగమ సలహాదారులు శ్రీ కృష్ణశేషాచల దీక్షితులు, సంక్షేమ విభాగం డిప్యూటీ ఈవో ఆనందరాజు, హెచ్‌డిపీపీ సెక్రటరీ శ్రీరాం రఘునాథ్, అర్చక బృందం, వేద పండితులతో పాటు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తిరుమల లడ్డు దొంగ || Journalist Bharadwaj EXPOSED Tirumala Laddu Controversy || TDP Vs Ycp || TR