తెలుగు రాష్ర్టాల సీఎంలు మరోసారి భేటి కానున్నారా? వాటర్ వార్ పై ముఖ్యమంత్రులు సుధీర్ఘ చర్చకు సిద్ధమవుతున్నారా? అంటే అవుననే సంకేతాలందుతున్నాయి. ఇటీవల ఏపీ-తెలంగాణ మధ్య తలెత్తిన వాటర్ వార్ మాటల యుద్ధానికి దారి తీసిన సంగతి తెలిసిందే. పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ కు అదనంగా శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి కృష్ణా నీటిని తరలించడంపై ఏపీ జీవో జారీ చేసి ముందుకెళ్తోన్న నేపథ్యంలో తెలంగాణ అభ్యంతరం చెప్పడం, పంచాయితీ కృష్ణాబోర్డు కు వెళ్లడం తెలిసిందే. ప్రతిగా ఏపీ మఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వివరణ ఇవ్వడం, కాళేశ్వరం ప్రాజెక్ట్ తో ఏపీ కి జరిగే నష్టంపై గోదావరి బోర్డుకు ఫిర్యాదు చేయడం జరిగింది.
దీంతో రెండు రాష్ర్టాల మధ్య మైత్రి దెబ్బతినడం ఖాయమంటూ సోషల్ మీడియా సహా మెయిన్ స్ర్టీమ్ మీడియాలో హైలైట్ అయింది. అన్నదమ్ముల్లా కలిసే ఉన్నాం..కలిసే పని చేస్తామని చెబుతున్న సీఎంలు ఇద్దరు చెప్పేది ఒకటీ…చేసేది మరొకటిగా కనిపిస్తున్నట్లు రెండు రాష్ర్టాలు ప్రజలు భావించాల్సిన సన్నివేశం తలెత్తింది. ఈ వాటర్ వార్ ఎంత దూరం వెళ్తుందోనని ప్రజల్లో ఆందోళన మొదలైంది. అయితే తాజా పరిస్థితులన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఇరువురు ముఖ్యమంత్రలు మరోసారి భేటీకి రెడీ అవుతున్నట్లు సమాచారం అందుతోంది. నదీ జలాల ప్రధాన అంశంగానే ఈ భేటి జరగనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఈ విషయంలో ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా జూన్ మొదటి వారంలో ఈ భేటీ నిర్వహించేలా సిద్దమవుతున్నారుట. ఇప్పటికే కృష్ణాబోర్డు రెండు రాష్ర్టాల ప్రభుత్వాలకు ప్రాజెక్ట్ విషయంలో ఎవరూ తొందరపడొద్దని..ఉన్నపళంగా నీటి తరలింపులు ఆపాలని ఆదేశాలిచ్చింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రులిద్దరు అపెక్సీ కమిటీ ముందుకు వెళ్లకుండానే సమస్యను పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇరు రాష్ర్టాల ఉన్నత స్థాయి అధికారులు ప్రత్యేక సమావేశం ఉంటుందని విశ్వసనీయ సమాచారం. కృష్ణా జలాల విషయంలో గతంలో తలెత్తినటి వంటి వివాదాలు తలెత్తకుండా ముందుగానే జాగ్రత్తపడాలని సీఎంలు ఇద్దరూ భావిస్తున్నట్లుంది. ఇప్పటికే ఇద్దరు సీఎంలు నాలుగుసార్లు భేటీ అయి వేర్వేరు అంశాలపై చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.