ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత. వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన విజయసాయిరెడ్డి, రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వైసీపీ అధినేత, ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన విజయసాయిరెడ్డి, అధినేత అంతరంగాన్ని తెలుసుకునే ఏ విషయమ్మీద అయినా స్పందిస్తుంటారు. పార్టీలో విజయసాయిరెడ్డి మాటకు తిరుగు లేదన్నది నిర్వివాదాంశం. కానీ, ఆ విజయసాయిరెడ్డి ఇప్పుడు పార్టీకి గుదిబండలా మారుతున్నారా.? మరీ ముఖ్యంగా విజయసాయిరెడ్డి ట్వీట్లు, పార్టీకి ఇబ్బందికరంగా మారుతున్నాయా.? అంటే, ఔననే అంటున్నారు వైసీపీ కార్యకర్తలు, మద్దతుదారులు కూడా. నిన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా విజయసాయిరెడ్డి వేసిన ‘420’ ట్వీట్ వివాదాస్పదమయ్యింది. అయితే, ఆ వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షల్ని హుందాగా చెప్పడంతో, విజయసాయిరెడ్డి కారణంగా ఏర్పడ్డ నెగెటివిటీ కాస్త బ్యాలెన్స్ అయ్యిందనే చెప్పాలి. తాజగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడ్డం గురించి విజయసాయిరెడ్డి వేసిన ట్వీట్ వివాదాస్పదమయ్యింది. మూడు రోజుల్లోనే పవన్ కళ్యాణ్ కరోనా నుంచి నెగెటివ్ ఎలా అయ్యారన్నది విజయసాయిరెడ్డి అనుమానం. కానీ, జనసేన పార్టీ ఇప్పటివరకు అధికారికంగా పవన్ కళ్యాణ్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నట్లు ప్రకటించలేదు. ఊహాజనిత అంశాల్ని పట్టుకుని, అత్యంత జుగుప్సాకరమైన ట్వీట్లేయడం ద్వారా విజయసాయిరెడ్డి, పార్టీకి నష్టం కలిగిస్తున్నారు తప్ప, ఆయన ట్వీట్ల వల్ల లాభం లేదనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.
పైపెచ్చు, విజయసాయిరెడ్డి ట్వీట్లకు ప్రత్యర్థుల నుంచి అత్యంత జుగుప్సాకరమైన రీతిలో స్పందనలు వస్తున్నాయి. విజయసాయిరెడ్డితోపాటు జగన్ మోహన్ రెడ్డి మీద కూడా అట్నుంచి నెగెటివ్ ట్వీట్లు వస్తున్నాయంటే, దీనికి బాధ్యత వహించాల్సింది విజయసాయిరెడ్డేనన్న చర్చ అంతటా జరుగుతోంది. కానీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలియకుండా, ఆయన అనుమతి లేకుండా విజయసాయిరెడ్డి ఇలా వ్యవహరిస్తారని అనుకోగలమా.? అన్నదీ ఆలోచించాల్సిన విషయమే.