షర్మిల రాజకీయం: ఆంధ్రపదేశ్ వర్సెస్ తెలంగాణ

Sharmila Politics: Andhra Pradesh Vs Telangana

Sharmila Politics: Andhra Pradesh Vs Telangana

తన రాజకీయ ప్రత్యర్థుల్ని ఇరకాటంలో పడెయ్యడానికి తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దగ్గరున్న అత్యద్భుతమైన ఆయుధం తెలంగాణ సెంటిమెంట్. దాదాపుగా అన్ని సందర్భాల్లోనూ ఇదే సెంటిమెంట్ వర్కవుట్ అవుతూ వస్తోంది ఆయనకు అనుకూలంగా.

మరి, షర్మిల రాజకీయంపై కేసీఆర్ అదే అస్త్రాన్ని ప్రయోగించబోతున్నారా.? ఏమోగానీ, తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతుదారులైతే ఇప్పటికే ఈ విషయమై తమ పని మొదలు పెట్టేశారు. ప్రధానంగా షర్మిలకు తెలంగాణలోని యువత నుంచి కంటే, ఆంధ్రపదేశ్ యువత నుంచి ఎక్కువ మద్దతు లభిస్తోంది. వైసీపీ శ్రేణులు పూర్తిస్థాయిలో షర్మిలకు అండగా నిలుస్తున్నాయి. ఆయా మద్దతుదారుల ఐడెంటిటీ సోషల్ మీడియాలో తేలిగ్గానే దొరుకుతోంది. దాంతో, ఇప్పుడీ వ్యవహారం ఆంద్రపదేశ్ వర్సెస్ తెలంగాణ.. అన్నట్టుగా తయారైపోయింది. ‘షర్మిల రాజకీయం చేయాల్సింది విజవాడలోనా.? హైదరాబాద్ లోనా.?’ అని టీఆర్ఎస్ మద్దతుదారులే కాదు, తెలంగాణలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు.

అయితే, ఈ పరిస్థితి రాకూడదని షర్మిల ఇప్పటికే చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ, ఏం లాభం.? పరిస్థితి మాత్రం చేజారిపోతోంది. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా రాజకీయ పార్టీని స్థాపించొచ్చు. తమ భావజాలాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించొచ్చు. కానీ, తెలంగాణ రాజకీయాలు చాలా చాలా ప్రత్యేకం. ఈ విభజన రాజకీయాల్ని చంద్రబాబు లాంటి తలపండిన రాజకీయ నాయకుడే తట్టుకోలేకపోయారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఒకానొక సమయంలో తెలంగాణ సెగను ఎదుర్కోలేకపోయారు. అంతెందుకు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా తెలంగాణ సెగ కారణంగానే, తెలంగాణలో వైసీపీని మూసేసుకోవాల్సి వచ్చింది. మరి, షర్మిల పరిస్థితి ఏమవుతుంది.? వేచి చూడాల్సిందే.