‘కల్కి’లో అశ్వత్థామగా అమితాబ్‌!

మహాభారతంలోని ఒక పాత్ర అశ్వత్థామ. సప్త చిరంజీవులుగా పేరుగాంచిన అశ్వత్థామ, బలిచక్రవర్తి, వ్యాస మహర్షి, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడులలో అతను ఒకడు. ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ ఇందులో ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ అశ్వత్థామగా కనిపించనున్నట్లు తెలుపుతూ ఆయన పాత్రను పరిచయం చేసింది. శరీరంపై గాయాలతో, చిరిగిన వస్త్రాలు కట్టుకుని అమితాబ్‌ కనిపించారు.

ఒక షాట్‌లో యంగ్‌ అమితాబ్‌ నుదుటిపై మణి కనిపిస్తుంది. ’ద్వాపర యుగం నుంచి దశావతారం కోసం ఎదురు చూస్తున్నా. ద్రోణాచార్య తనయుడు అశ్వత్థామని..’ అని అమితాబ్‌ చెప్పడంతో ఇంతకీ ఎవరాయన అని నెటిజన్లు గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారు. శ్రీకృష్ణుడు అతనికి ఇచ్చిన శాపం ఏంటన్న ఆసక్తి నెలకొంది. పాండవులు, కౌరవులకు గురువైన ద్రోణుని ఏకైక కుమారుడు అశ్వత్థామ. అతడి తల్లి కృపి. ద్రోణుడి తపస్సుకు మెచ్చి, శివుని వరం వల్ల అతడు నుదుటిపై మణితో జన్మిస్తాడు. ఆ మణి ప్రభావం కారణం ఇతర మానవులతో పోలిస్తే, ఆకలి, దప్పుల నుంచి రక్షణ పొందగలడు. అర్జునుడితో సమానంగా ధనుర్విద్యలో నైపుణ్యం సాధిస్తాడు.

ద్రోణాచార్యుడు పాండవ సైన్యంపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్న సమయంలో ఎదురుగా వచ్చిన ధర్మరాజు ‘అశ్వత్థామ హత్ణ..’ అని గట్టిగా చెప్పి..’కుంజర్ణ’ అని నెమ్మదిగా అంటాడు. తన కుమారుడే మరణించాడనుకుని ద్రోణాచార్యుడు యుద్ధంలో అస్త్ర సన్యాసం చేస్తాడు. ఇదే అదనుగా భావించిన దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడిని చంపేస్తాడు. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో కర్ణ దుర్యోధనాదులు, ఇతర కౌరవ సైన్యాన్ని మట్టుబెట్టి మహాభారత యుద్ధంలో పాండవులు విజయం సాధిస్తారు. తండ్రి మరణం, స్నేహితులైన కౌరవులు నశించడం సహించలేకపోయిన అశ్వత్థామ తీవ్ర కోపంతో తన తండ్రి అనుగ్రహించిన బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని ‘అపాండవీయం అవుగాక’ అని ప్రయోగిస్తాడు.

పోటీగా అర్జునుడు కూడా అదే అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. పెద్దల సూచన మేరకు అర్జునుడు తన అస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. అశ్వత్థామ ప్రయోగంతో ఉత్తర గర్భం విచ్ఛినమవుతుంది. అశ్వత్థామ కుటిల బుద్ధికి కోపోద్రిక్తుడైన శ్రీకృష్ణుడు అతడి తలపై ఉన్న సహజ మణిని తీసి శపిస్తాడు. ’ఒంటి నుంచి రక్తం కారుతూ దుర్గంధంతో, ఆహారం దొరక్క మండిపోతున్న శరీరంతో ఈ భూవ్మిూదే తిరుగు’ అని పేర్కొంటాడు.

బ్రహ్మాశిరోనామకాస్త్ర ప్రయోగం వల్ల ఉత్తర గర్భంలో మరణించిన శిశువును కృష్ణుడు తన యోగమాయతో ప్రాణంపోసి బతికిస్తాడు. ఆ బిడ్డ పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరినీ పరీక్షగా చూస్తుండటంతో అతడికి పరీక్షిత్‌ అని పేరు పెడతారు.’కల్కి’లో అమితాబ్‌ అశ్వత్థామగా కనిపిస్తుండటంతో ఆ పాత్రపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, కమల్‌హాసన్‌, దిశా పటానీ, రాజేందప్రసాద్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై ఈ చిత్రం రూ.600 కోట్ల భారీ బ్జడెట్‌తో రూపొందుతోంది.