షాహిద్‌కు పెద్ద ఫ్యాన్‌ను: మృణాల్‌ ఠాకూర్‌

షాహిద్‌ కపూర్‌ హీరోగా దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి తెరకెక్కించిన చిత్రం ‘జెర్సీ’. నాని కథానాయకుడి గా తెలుగులో వచ్చిన ‘జెర్సీ’ రీమేక్‌గా రూపొందింది. ఇందులో షాహిద్‌ సరసన మృణాల్‌ ఠాకూర్‌ నటించారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆ సినిమాలోని ఓ సన్నివేశాన్ని గుర్తుచేసుకున్నారు.”నేను షాహిద్‌ కపూర్‌కు అభిమానిని. ఆయనతో కలిసి నటించే అవకాశం రాగానే వెంటనే ఓకే చెప్పాను. మొదటిరోజు షూటింగ్‌లో ఆయన నవ్వు చూస్తూ చాలాసేపు అలానే ఉండిపోయా. విూ నవ్వు తెరపై ఎలా ఉందో నిజంగా కూడా అలాగే ఉందని చెప్పాను.

ఆయనతో నటించిన రోజులను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. మంచి కో-స్టార్‌. అంతపెద్ద స్టార్‌తో నటించాలంటే మొదట ఇబ్బందిగా అనిపించింది. వారం తర్వాత అలవాటుపడ్డాను. ఆ సినిమాలో ఒక సన్నివేశంలో నటించాలంటే చాలా భయపడ్డాను. అందులో షాహిద్‌ కపూర్‌ను కొట్టే సన్నివేశం చాలా కఠినమైనది. నేను నిదానంగా కొడతాను.. విూరు ఎడిట్‌ చేసుకోండి అని సూచించాను. దానికి దర్శకుడు అంగీకరించలేదు. ఈ సీన్‌కు షాహిద్‌ చాలా సపోర్ట్‌ చేశారు.’విూ మాజీ బాయ్‌ఫ్రెండ్‌ను గుర్తుచేసుకుని నన్ను చెంపదెబ్బ కొట్టండి’ అని సరదాగా చెప్పారు. ఆ సన్నివేశాన్ని కేవలం రెండు కెమెరాలతో చిత్రీకరించారు. మూడు గంటల సమయం పట్టింది’ అని గుర్తుచేసుకున్నారు.

ఇక మృణాల్‌ తనకు వచ్చిన అవకాశాల గురించి ఇటీవల మాట్లాడారు. తనను తాను నిరూపించుకొనే అవకాశాల కోసం ఎదురుచూసినట్లు చెప్పారు. తల్లి, అక్క పాత్రలు పోషించాల్సి వచ్చినా భయపడనన్నారు. సంవత్సరానికి 5 సినిమాల్లో నటించాలనే కోరికేం లేదని.. చేసిన ఒక్క చిత్రమైనా ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తిండిపోతే చాలన్నారు. తాజాగా విజయ్‌ దేవరకొండతో కలిసి ‘ఫ్యామిలీస్టార్‌’తో సందడి చేసిన మృణాల్‌ ప్రస్తుతం బాలీవుడ్‌లో ఒక సినిమా చేస్తున్నారు.