రజనీ చిత్రం ఫస్ట్‌ లుక్‌పై భారీ స్పందన!

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సెన్షెషనల్‌ డైరెక్టర్‌ లోకేష్‌ కనకరాజ్‌ కాంబినేషన్‌లో ఒక చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రజనీ 171 వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ బ్యానరుపై నిర్మాత కళానిధి మారన్‌ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను నిర్మాణ సంస్థ విడుదల చేయగా, రజనీకాంత్‌ అభిమానులతో పాటు ప్రేక్షకుల నుంచి విశేష స్పందనను రాబట్టుకుంది. సినిమా టైటిల్‌ను విడుదల చేయనున్నట్లు లోకేశ్‌ తన సోషల్‌ విూడియాలో తెలపడంతో నెట్టింట ఇప్పుడు ఈ వార్త బాగా హల్‌చల్‌ అవుతోంది.

తాజాగా ఈ చిత్రంలో కింగ్‌ నాగార్జున కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం లోకేశ్‌ కనగరాజ్‌ హైదరాబాద్‌కు వచ్చి నాగార్జునకు స్టోరీ చెప్పడం, అది నచ్చి ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సామాజిక మాధ్యమాల్లో న్యూస్‌ చక్కర్లు కొడుతోంది. దీంతో మునుపెన్నడు చూడని మల్టీస్టారర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం.

ఇప్పటికే రానా, దల్కర్‌ సల్మాన్‌ ఇందులో కనిపించబోతున్నట్లు తెలుస్తుండగా ఇటీవలే సీనియర్‌ నటి శోభన, శృతిహసన్‌ కూడా ఈ చిత్రంలో భాగమవుతునట్లు వార్తలు వినిపిస్తుండడంతో ఈ సినిమాపై రోజురోజుకు అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. కాగా నాగార్జున తాజాగా ధనుష్‌ హీరోగా రూపొందుతున్న కుబేరా సినిమాలోనూ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే.. ఈ చిత్రం టైమ్‌ ట్రావెల్‌ కథ అని కొందరు, లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ చిత్రాలలోని రోలెక్స్‌కు రిలేటెడ్‌గా ఈ సినిమా ఉండబోతుందనే వార్తలు సోషల్‌ విూడియాలో బాగా వైరల్‌ అవుతున్నాయి. ఈ సినిమాకు తంగమ్‌ అనే పేరు ఫైనల్ చేసినట్లు తెలుస్తోండగా జూన్‌లో ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్లి ఈ ఏడాది చివరకు సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్‌ ప్లాన్ చేస్తున్నారు. అన్బరివు స్టంట్స్‌, అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్నారు. దీని తర్వాత ‘ఖైదీ 2’ మొదలు పెట్టనున్నట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో లోకేష్‌ తెలిపాడు. రజనీకాంత్‌ నటించిన తాజా చిత్రం ఈ వేసవిలో విడుదల కానుంది.