సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు వేడెక్కిపోతున్నాయి. ప్రధానంగా అధికార – విపక్షాల మధ్య మాటల యుద్ధాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ సమయంలో… తన వల్ల, ఈ ప్రభుత్వం వల్ల మంచి జరిగితేనే ఓటు వేయమని జగన్ కోరుతూ సరికొత్త రాజకీయాలకు తెరలేపారు. అయితే… జగన్ పాలనలో అప్పులు తెచ్చి డబ్బులు పంచడం తప్ప ఏమీ చేయలేదని.. అయితే తాము అధికారంలోకి వస్తే మాత్రం జగన్ పథకాలను కంటిన్యూ చేస్తామని కూటమి నేతలు చెబుతున్నారు!
ఇదే సమయంలో… తాను అధికారంలోకి వస్తే ప్రతీ ఆడబిడ్డనూ లక్షాధికారిని చేసే బాధ్యత తనదని, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చంద్రబాబు చెబుతున్నారు. ఇదే సమయంలో… మరో అవకాశం ఇస్తే ఇప్పటికే తనను ఏడు సార్లు గెలిపించిన కుప్పాన్ని అభివృద్ధి చేసి ఆ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటామని చంద్రబాబు హామీ ఇస్తున్నారు. ఇదే సమయంలో కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు ఉంటే ఇక అభివృద్ధికి తిరుగుండదని పవన్ చెబుతున్నారు. దీంతో… 2014 చర్చను వైసీపీ నేతలు తెరపైకి తెస్తున్నారు.
ఆ సంగతి అలా ఉంటే… సిద్ధం, మేమంతా సిద్ధం అంటూ రాష్ట్ర రాజకీయాలలో కాకరేపిన వైఎస్ జగన్… మరో యాత్రకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 28 నుంచి ప్రతీ రోజూ మూడు ప్రాంతాలనూ కవర్ చేస్తూ.. రోజుకి మూడు నియోజకవర్గల్లో భారీ బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ను విడుదల చేసింది వైసీపీ కేంద్ర కార్యాలయం. అయితే.. ఈ యాత్రలో జగన్ లక్ష్యం ప్రధానంగా 2014లో కూటమి ఇచ్చిన మ్యానిఫెస్టోపై అని తెలుస్తుంది.
సిద్ధం అంటూ కార్యకర్తలతో భారీ ఎత్తున సభలు నిర్వహించిన జగన్… ఈ ఐదేళ్లలో తమ ప్రభుత్వం చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం… మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్ర చేపట్టిన ఆయన… తాను చేసిన మంచిని ప్రజలకు వివరించారు. తనవల్ల మేలు జరిగితేనే ఓటు వేయమని అడిగారు.. గత ప్రభుత్వ పాలనతో తన పాలను కంపేర్ చేసుకోమని ధీమాగా చెప్పారు.. మరోసారి ఆశీర్వదించమని కోరారు.
ఇక ఈ నెల 28 నుంచి మొదలవ్వబోయే సభల్లో జగన్ ప్రధానంగా… 2014లో ప్రజలకు సంతకాలు చేసి మరీ ఉత్తరాలు రాసి ఇచ్చిన కూటమి 600 హామీలను టార్గెట్ చేయబోతున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా… ఆ 600 హామీల్లో ఎన్ని హామీలు నెరవేరాయో ప్రజలకు స్పష్టం గా చెప్పబోతున్నారని అంటున్నారు. ఇదే సమయంలో… ప్రజలు ఆ విషయంపై ఆలోచించే దిశగా సూచనలు చేయబోతున్నారని సమాచారం.
ఇప్పటికే ఈ విషయంపై జగన్ స్పందించారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కలిసే పోటీ చేశారని.. 600కు పైగా హామీలతో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేశారని.. ఆ మేనిఫెస్టోలో చంద్రబాబుతోపాటు పవన్ ఫొటో కూడా ముద్రించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అప్పుడు ఇద్దరూ కలిసే జనానికి హామీలిచ్చి మోసం చేశారని.. పీఠమెక్కాక ముసుగు తొలగించి, అసలు రూపాన్ని బయటపెట్టుకున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజలను నిలువునా మోసగించారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.
ఈ క్రమంలో రానున్న మలివిడత ప్రచార కార్యక్రమాల్లో ప్రధానంగా ఈ అంశాన్నే జగన్ లేవనెత్తబోతున్నారని అంటున్నారు. అయితే.. ఈ విషయంపై టీడీపీ నేతలు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి కావడంతో… వార్ వన్ సైడ్ గా ఈ దూకుడు ప్రచారం ఉండే అవకాశం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు!