తమిళ, మలయాళ, హిందీ క్యారెక్టర్ నటులు తెలుగు పరిశ్రమను ఏలుతున్న ఈ సమయంలో తెలుగు నటులు తమ ప్రాతినిధ్యాన్ని నిలబెట్టుకోవాలంటే ఎంతో కష్టపడాలి, వైవిధ్యం చూపించాలి. అలా నిలబెట్టుకున్న నటుల్లో రావు రమేష్ ని ప్రధమంగా చెప్పుకోవచ్చు. ఎంతమంది ఎన్నివిధాలుగా పోటీగా వున్నా, రావు రమేష్ తనదైన శైలిలో, తనదైన మాటలు, హావభావాలతో తెలుగు ప్రేక్షకులని రంజింపచేస్తూ, తనకుంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అటువంటి రావు రమేష్ చిన్న పాత్రల దగ్గర నుండి, ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ నటుడిగా తెలుగు ప్రేక్షకులకి ఎంతో వినోదం పంచారు, ప్రేక్షకులకి ఎంతో దగ్గరయ్యారు.
అయితే ఇప్పుడు దర్శక నిర్మాతలు రావు రమేష్ ని దృష్టిలో పెట్టుకొని కథలు రాసుకుంటూ అతన్ని ప్రధాన పాత్రలో చూపించి ప్రేక్షకులకి నూటికి నూరు శాతం వినోదాన్ని అందించటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో మొదటి ప్రయత్నంగా ’మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం’ సినిమా పూర్తయింది, విడుదలకి సిద్ధంగా వుంది. ఇందులో రావు రమేష్ ప్రధాన పాత్ర పోషిస్తే, లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. ఆ సినిమా తరువాత దర్శకుడు మారుతి టీమ్ ప్రోడక్ట్ మరియు వానరా సెల్యూలాయిడ్ సంయుక్త నిర్మాణంలో రావు రమేష్ ప్రధాన పాత్రలో ఇంకొక సినిమా ప్రారంభం అయింది. అంకిత్ కొయ్య, విశాఖ ధిమన్ ఇందులో జంటగా నటిస్తుండగా, బాల సుబ్రహ్మణ్యమ్ దర్శకుడు, ఎ విజయ్ పాల్ రెడ్డి నిర్మాత.
ఈ సినిమా పేరు ’బ్యూటీ’ అని పెట్టారు. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని ఫిలింనగర్ దైవ సన్నిధానంలో ఈరోజు జరిగాయి. దర్శకుడు మారుతి క్లాప్ కొట్టగా, మరో దర్శకుడు బుచ్చిబాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకులు వీరశంకర్, సుబ్బు మంగాదేవి, డార్లింగ్ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఇది ఒక ప్రేమ, కుటుంబ భావోద్వేగాల నేపథ్యంలో తెరకెక్కబోతున్న చిత్రం అని చిత్ర నిర్వాహకులు చెపుతున్నారు. మే 2వ తేదీ నుండి చిత్రీకరణ ప్రారంభం అవుతుందని తెలిపారు. ఈ సినిమాకి విజయ్ బుల్గానిన్ సంగీతం, సిద్ధం మనోహర్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. రావు రమేష్ ప్రధాన పాత్రలో ఇంకో సినిమా కూడా రేపు ప్రారంభం కానుంది. సందీప్ కిషన్ కథానాయకుడు, నక్కిన త్రినాథ రావు, దర్శకుడు. రాజేష్ దందా నిర్మాత, ఏకే ఎంటర్ టైనమెంట్స్ అధినేత అనిల్ సుంకర ఈ సినిమాలో భాగస్వామ్యం.