ఏపీ ఫలితాలు… కేటీఆర్ క్లోజ్.. కేసీఆర్ ఓపెన్!

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రసవత్తర రాజకీయాలకు తెరలేచింది. ఇందులో భాగంగా… తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు రంగం సిద్ధమవుతుండగా.. ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ సమయంలో ఈ ఎన్నికల్లో ఏపీలో విజయం ఎవరికి దక్కుతుంది.. ఏపీలో ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణస్వీకారం చేయబోతున్నారని అనే చర్చ తీవ్రంగా నడుస్తుంది.

మరోపక్క పలు సర్వే ఫలితాలు సందడి చేస్తున్నాయి. అందులో మెజారిటీ సర్వే ఫలితాలు.. రానున్న ఎన్నికల్లో వైసీపీ మరోసారి విజయకేతనం ఎగురవేస్తాయని చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దాదాపు అన్ని సర్వే ఫలితాలు ఇదే విషయాన్ని చెబుతూ.. గతంలో వచ్చినన్ని సీట్లు మాత్రం రావని స్పష్టం చేస్తున్నాయి. ఇందులో భాగంగా… 110 నుంచి 125 స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలిచే అవకాశాలున్నాయని అంటున్నారు.

ఈ నేపథ్యంలో… ఇటీవల ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో స్పందించిన బీఆరెస్స్ వర్కింగ్ ప్రెసిండెంట్, తెలంగాణ రాజకీయాల్లో కీలక నేత కేటీఆర్… ఏపీ రాజకీయాలపై ఓపెన్ కాలేకపోయారు! అక్కడున్న సీఎం జగన్ తనకు అన్న అని.. పవన్ కల్యాణ్, లోకేష్ లు తనకు స్నేహితులని చెబుతూ… అక్కడ ఎవరు అధికారంలోకి వస్తారనే విషయాన్ని తాను చెప్పలేనని, ఎవరు అధికారంలోకి వచ్చినా ఓకే అన్నట్లుగా స్పందించారు!

ఆ సంగతి అలా ఉంటే… తాజాగా అదే టీవీ ఛానల్ ఇంటర్వ్యూకి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆరెస్స్ అధినేత కేసీఆర్ హాజరయ్యారు. ఈ క్రమంలో… రానున్న రోజుల్లో ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రావొచ్చు.. రావాలని కోరుకుంటున్నారనే ప్రశ్నలు ఆయనకు ఈ సందర్భంగా ఎదురయ్యాయి. ఈ సందర్హంగా స్పందించిన కేసీఆర్… తనకున్న సమాచారం మేరకు ఏపీలో మరోసారి జగన్ అధికారంలోకి రాబోతున్నారని అన్నారు.

దీంతో… ఈ వ్యాఖ్యలు ప్రధానంగా ఏపీ రాజకీయాల్లో వైరల్ గా మారాయి. అయితే.. కేసీఆర్ తన మనసులో ఉన్న కోరికను ఇలా వ్యక్తపరిచారా.. లేక, సర్వే ఫలితాలతో పాటు తనకు వ్యక్తిగతంగా ఉన్న పక్కా సమాచారం మేరకు ఇలా వెల్లడించారా అనేది ఆసక్తిగా మారింది. ఏది ఏమైనా జగన్ గెలవాలని కేసీఆర్ ఎపుడూ కోరుకుంటారు అని అంటున్న నేపథ్యంలో… కేసీఆర్ జోస్యం నిజమవుతుందా లేదా అన్నది జూన్ 4 వరకూ వేచి చూడాలి!