Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఆశించిన రెస్పాన్స్ వచ్చినట్టేనా.?

Pawan Kalyan : మూడు నెలలకో, ఆరు నెలలకో ఓ సారి రాజకీయ తెరపై తనదైన స్పెషల్ సినిమాని రిలీజ్ చేస్తుంటారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఫస్ట్ డే టాక్ అదిరిపోతుంది. ఆ తర్వాత రెండు మూడు రోజులకి వాతావరణం చల్లారిపోతుంది. సినిమా అయినా, రాజకీయమైనా సేమ్ టు సేమ్. పెద్దగా తేడా ఏమీ వుండదు.. పవన్ కళ్యాణ్ విషయంలో.

రెండు చోట్లా ఓడిపోయిన పవన్ కళ్యాణ్‌ని మామూలుగా అయితే, అధికార వైసీపీ పట్టించుకోవల్సిన అవసరం లేదు. కానీ, ముఖ్యమంత్రి దగ్గర్నుంచీ, చోటా మోటా ఎమ్మెల్యేల వరకూ, ఇతర నేతలు సైతం పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడడానికి పోటీ పడుతుంటారు. అలా అధికార పార్టీలో ఓ పెద్ద ప్రకంపనకి తరచూ పవన్ కళ్యాణ్ కారణమవుతుంటారు.

జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మంత్రులను తూలనాడారు. దాంతో జనసేన శ్రేణుల్లో ఉత్సాహం ఉప్పొంగిపోయింది. సీన్ కట్ చేస్తే, వచ్చిన పని ముగించుకుని పవన్ కళ్యాణ్ హైద్రాబాద్ వెళ్లిపోయారు. ఇంకోపక్క, వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్‌ని విమర్శించేందుకు క్యూ కట్టేశారు.

పేర్ని నాని, కొడాలి నాని, బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్..  ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దదే వుంది. అవసరానికి మించి మంత్రులిలా పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేశారంటే, దాని అర్ధం పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ వైసీపీ మీద చాలా గట్టిగా పడిందనే. తెలిసో తెలియకో పవన్ కళ్యాణ్‌కి వైసీపీ నేతలే ఎక్కువ బిల్డప్ ఇస్తున్నట్లుంది.