ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు హీటెక్కిపోతున్నాయి. విమర్శలు, ప్రతివిమర్శలతో రోహిణీ కార్తి ఎండలను మరిపిస్తున్నాయి. ఈ సందర్భంగా కొంతమంది శృతిమించి విమర్శలు చేస్తుంటే.. మరికొంతమంది గురింవింద నీతి కబుర్లు చెబుతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ల వైఖరిపై నెట్టింట ఆసక్తికరమైన చర్చ మొదలైంది!
అవును… ఎన్నికల వేళ ఏపీ రాజకీయాల్లోని విమర్శలు, ప్రతి విమర్శలూ పీక్స్ కి చేరుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో తాజాగా వైఎస్ జగన్ విషయంలో షర్మిల చేసిన వ్యాఖ్యలతో పాటు.. పవన్ కల్యాణ్ వ్యవహారశైలిని గురివిందతో పోలుస్తూ, అందుకు గల కారణమైన గతాన్ని గుర్తుచేస్తూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఇప్పుడు ఆ గతాలు ఏమిటి.. ఆ కబుర్లు ఏమిటి.. వస్తోన్న ఆ కామెంట్లు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం…!
“మేమంతా సిద్ధం” బస్సు యాత్రలో భాగంగా విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేశారు వైఎస్ జగన్. ఈ క్రమంలో… మంత్రి బొత్స సత్యనారాయణను పరిచయం చేసినప్పుడు.. పైకి అన్నా అని పిలుస్తాను కానీ, తనకు తండ్రి సమానులని, ప్రజలంతా ఆశీర్వదించాలని కోరారు. దీంతో… మంత్రి బొత్స ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.
ఈ విషయంపై స్పందించిన వైఎస్ షర్మిళ… జగన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. గతంలో వైఎస్సార్ ని బొత్స తిట్టిపోశారని, ఆ మాటకొస్తే వైసీపీలో ఉన్నవారు, జగన్ కేబినెట్ లో ఉన్నవారంతా రాజశేఖర్ రెడ్డిని తిట్టారని.. అలాంటి వారిని జగన్ పక్కనపెట్టుకున్నారని.. వారందరినీ తండ్రులు, అన్నలు, చెల్లెల్లూ అంటున్నారని ఒకింత వెటకారంగా స్పందించారు!
దీంతో… వైఎస్ షర్మిళకు గతం గుర్తుచేస్తున్నారు పరిశీలకులు. ఇందులో భాగంగా… గతంలో జగన్ కాంగ్రెస్ ని వీడిన తర్వాత బొత్స.. వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన విషయం వాస్తవమే! అయితే ఆ తర్వాత ఆయన కూడా కాంగ్రెస్ ని వీడి జగన్ తోనే ఉన్నారు. జగన్ కోసం పనిచేస్తూ.. ఉత్తరాంధ్రలో వైసీపీ బలపడటంలో కీలక పాత్ర పోషించారు. జగన్ కూడా బొత్సకు ఆ గౌరవం ఇస్తుంటారు!
అయితే.. అదే బొత్స వైసీపీలో ఉన్నప్పుడు షర్మిల కూడా ఆ పార్టీ కోసమే పని చేశారు. అప్పుడు బొత్స ఎలాంటి వారో షర్మిలకు గుర్తు రాలేదా.. నాడు బొత్స, తన తండ్రి వైఎస్సార్ ని తిట్టారనే విషయం షర్మిళ మరిచారా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఇదే క్రమంలో… ఇటీవల తెలంగాణలో రాజన్న రాజ్యం కోసం అంటూ వైఎస్సార్టీపీ పెట్టి కాంగ్రెస్ ని తిట్టిపోసిన షర్మిళ.. రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కట్ చేస్తే… షర్మిళ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తిట్టిన రేవంత్ రెడ్డితో కలసిపోయారు. వేదికలెక్కి చేతులు కలిపి పైకెత్తుతున్నారు! అంటే షర్మిల చెబుతున్నదొకటి, చేస్తున్నదొకటి అనే అర్ధం కదా.. అంటూ నెటిజన్లు ఈ విషయాలను ప్రస్తావిస్తున్నారు. ఈ క్రమంలోనే… దీన్నే గురువింద వ్యవహారం అంటారని స్పష్టం చేస్తున్నారు.
ఇదే సమయంలో… పవన్ కల్యాణ్ విషయాన్ని ప్రస్థావిస్తున్నారు నెటిజన్లు. పవన్ కల్యాణ్ కి పరిటాల రవి గుండుకొట్టిచ్చారంటూ వార్తలు ఏ మీడియా రాసిందనేది అందరికీ తెలిసిన విషయమే. అప్పట్లో వారిపై పవన్ కోపగించుకున్నారు కూడా! అనంతరం… తన తల్లిని తిట్టారంటూ చంద్రబాబు, లోకేష్ లపై తనదైన శైలిలో రెచ్చిపోయారు.
కట్ చేస్తే ఇప్పుడు అదే చంద్రబాబు కోసం, అదే లోకేష్ రాజకీయ భవిష్యత్తు కోసం అవిరామంగా పనిచేస్తున్నారు! అదే వర్గం మీడియాతో అంటకాగుతున్న పరిస్థితి! దీన్ని కూడా గురివింద నీతి అని ఒకరంటే… రోషం, పౌరుషం అంటూ మాట్లాడేవారంతా.. చేతల దగ్గరకు వచ్చే సరికి ఇలాంటి పెర్ఫార్మెన్సే ఇస్తారని మరొకరంటున్నారు. ఏది ఏమైనా… రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అనేది ఇంకొందరి మాట! రాజకీయాల కోసం ఇంతకు దిగజారాలా… అమాయకుల మాట!!