దీపక్‌ పరంబోల్‌తో అపర్ణాదాస్‌ ఏడడుగులు!

‘ఆదికేశవ’ సినిమాతో తెలుగువారికి సుపరిచితురాలైన నటి అపర్ణాదాస్‌. హీరో సోదరి పాత్రలో నటించి, ఇక్కడి ప్రేక్షకులను అలరించారు. తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’తో ఇటీవల విజయాన్ని అందుకున్న మలయాళీ నటుడు దీపక్‌ పరంబోల్‌తో ఆమె ఏడడుగులు వేశారు. కేరళలోని గురువాయూర్‌ దేవాలయంలోఇటీవల వీరి పెళ్లి ఘనంగా జరిగింది. ఇరు కుటుంబాల పెద్దలు, సన్నిహితులు ఈ వేడుకకు హాజరయ్యారు.

దీనికి సంబంధించిన ఓ ఫొటో తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ’నాన్‌ ప్రకాశన్‌’తో నటిగా తెరంగేట్రం చేశారు అపర్ణాదాస్‌. 2019లో విడుదలైన ‘మనోహరమ్‌’ హీరోయిన్‌గా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే దీపక్‌ పరంబోల్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి.. పెద్దల అంగీకారంతో ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు. 2023లో విడుదలైన ‘డాడా’ అపర్ణాదాస్‌ కెరీర్‌లో సూపర్‌హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆమె మలయాళంలో తెరకెక్కుతోన్న’ఆనంద్‌ శ్రీబాల’ కోసం వర్క్‌ చేస్తున్నారు.