దేవరకొండతో ప్రశాంత్‌ నీల్‌ భేటీ!? … సినిమా కోసమేనా అన్న ఊహాగానాలు!?

కెరీర్‌ పరంగా బిగ్గెస్ట్‌ సక్సెస్‌ కోసం ఎదురుచూస్తున్నారు నటుడు విజయ్‌ దేవరకొండ. ఇటీవల ‘ఫ్యామిలీస్టార్‌’గా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఆ చిత్రం ద్వారా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయారు. ప్రస్తుతం ఆయన దృష్టి గౌతమ్‌ తిన్ననూరి ప్రాజెక్ట్‌పైనే ఉంది.

ఇదిలా ఉండగా, ఇటీవల హైదరాబాద్‌ వచ్చిన ప్రముఖ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఆయన్ని కలిశారు. దీంతో వీరిద్దరి కాంబోలో కొత్త ప్రాజెక్ట్‌ ఉండొచ్చని పలు కథనాలు చక్కర్లు కొట్టాయి. అయితే, అందులో నిజం లేదని వాళ్ల టీమ్స్‌ క్లారిటీ ఇచ్చాయి.’సలార్‌’తో గతేడాది విజయాన్ని అందుకున్నారు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. ప్రభాస్‌ హీరోగా నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఘన విజయాన్ని అందుకుంది.

దీనికి సీక్వెల్‌గా ‘సలార్‌ శౌర్యంగపర్వం’ రూపుదిద్దుకోనుంది. ఎపిక్‌ యాక్షన్‌ మూవీగా సిద్ధం కానున్న ఈ ప్రాజెక్ట్‌లో విజయ్‌ దేవరకొండ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.’సలార్‌ 2’ చివర్లో కనిపిస్తారని.. ఆయన రోల్‌ సినిమాలో ఆసక్తిగా ఉండనుందని టాక్‌. దీనిపై టీమ్‌ నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ కలిసింది కొత్త సినిమా కోసం కాదని.. ’సలార్‌ 2’ కోసమేనని పలువురు అంటున్నారు.