పళ్ళు పటపటా కొరుకుతున్నారట… ఆ 32మంది మృతికి కారకులెవ్వరు?

వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు 2024 మార్చి వరకూ లైఫ్ ప్రశాంతంగా ఉండేది! సరిగ్గా ఒకటో తేదీ వచ్చిందంటే తెల్లవారు జామునే వాలంటీర్ వచ్చి పెన్షన్ డబ్బులు చేతిలో పెట్టి వెళ్లిపోయేవారు. పెన్షన్ అర్హులు ఎవరిని అడిగినా… ఒకటో తేదీ 7 గంటల తర్వాత ఆ పని చేసి పెట్టు, ఈ పని చేసి పెట్టు అని అడిగేవారు. కారణం… ఆ సమయంలోపు వారి చేతిలో పెన్షన్ డబ్బులు ఉంటాయనే నమ్మకం!

అయితే ఎన్నికల వేళ టీడీపీ సానుభూతిపరులుగా, చంద్రబాబు శ్రేయోభిలాషులుగా పేరున్న కొంతమంది ఏపీలో వాలిపోయారు! ఎన్నికల వెళ ఇంటింటికీ పెన్షన్ తీసుకెళ్లి ఇచ్చే వాలంటీర్ల విధులను అడ్డుకోవాలని కోరారు! అనుకున్నది సాధించారు! ఫలితంగా… పండుటాకుల ఉసురు పోసుకున్నారనే కామెంట్లు వినిపించాయి! ఇలా వారు చేసిన ఆ పనికి ఏప్రిల్ 1న పెన్షన్ అందక, మండుటెండలో తిరగలేక సుమారు 32 మంది మృతి చెందారు.

40 డిగ్రీలకు పైగా ఉన్న మండుటెండలో పండుటాకులను రెండు, మూడు కిలోమీటర్లు వెళ్లి సచివాలయాల వద్ద పింఛన్లు తీసుకోమంటే వారి పరిస్థితేంటి? వృద్ధుల్ని మంచాలపైనా, చక్రాల కుర్చీలపైనా గ్రామ, వార్డు సచివాలయాలకు తీసుకెళ్లి వేలిముద్ర వేయించి పించన్ తీసుకోవాల్సిన దుస్థితి కల్పించారు! పెన్షన్ దారులను ఏడిపించారు.. వారి కన్నీటికి కారకులయ్యారు! ఇప్పుడు మాత్రం సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు!

మరో నాలుగు రోజుల్లో పింఛన్ల పంపిణీ చేయాల్సి ఉండగా చీఫ్ సెక్రటరీ ఇంటింటికీ పెన్షన్ అందించటానికి ప్లాన్ చేయడం లేదని అంటున్నారు. దీంతో… అసలు ఈ సమస్యకు కారకులు ఎవ్వరు.. కడుపులో చల్ల కదలకుండా ఉండే పెన్షన్ దారులను రోడ్లపైకి తెచ్చిందెవరు.. 58 నెలల పాటు వారికి పెన్షన్ అందుకునే విషయంలో ఏ ఇబ్బంది రాకుండా చూసుకున్న జగన్ సర్కార్ ఏర్పాటు చేసిన వాలంటీర్లకు ఇప్పుడు ఆ అవకాశం లేకుండా చేసింది ఎవరు?

మరో నాలుగురోజుల్లో ఒకటో తేదీ వస్తుంది. వాలంటీర్లకు ఇంటింటికీ పించన్ అందించే బాధ్యతలు లేవు. తమ అవసరం లేనప్పుడు ఆ బాధ్యతల్లో ఉండటం ఎందుకంటూ.. వారు రాజీనామాల బాట పట్టారు. సచివాలయ సిబ్బంది వారి రోజు వారీ కార్యక్రమాల్లో వారు బిజీగా ఉన్నారని అంటున్నారు! మరోపక్క ఇప్పటికే ఎండలు 42 నుంచి 45 డిగ్రీల మధ్య ఉందని.. మరీ అవసరమైతే తప్ప యువకులు సైతం బయటకు రాకపోవడమే మంచిదన్ని అధికారులు చెబుతున్నారు!

మరి ఈ పరిస్థితుల్లో మే నెల ఒకటో తేదీన పెన్షన్ అందుతుందా.. లేక, కనీసీం రెండు మూడు సార్లు మండుటెండలో తిరగాల్సిందేనా.. లేక, ఏమాత్రం అవకాశం ఉన్నా ఎన్నికల కమిషన్ కాస్త చొరవ తీసుకుని, ఈ విషయంలో ఏదైనా ముందస్తు చర్యలకు రిఫర్ చేస్తుందా అనేది వేచి చూడాలి. ఈ సందర్భంగా పెన్షన్ దారులు… చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ల పేర్లు పలుకుతూ ఉన్న ఆ నాలుగు పళ్ళు పటపటా కొరుకుతున్నారని సమాచారం.