ఈ ఎన్నికలు పేదలకూ, పెత్తందారులకూ మధ్య యుద్ధం… పేదల తరుపున పనిచేసే తనకూ, పెత్తందారులకు కొమ్ముకాసే చంద్రబాబుకూ మధ్య యుద్ధం… కేవలం ఇవి ఎన్నికలు మాత్రమే కాదు! పేద ప్రజలను, ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారీటీ ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగా చూసే వారికీ… వారిని రాజ్యాధికారంలో భాగస్వాములుగా చేసిన తనకూ మధ్య జరుగుతున్న “క్లాస్ వార్” అంటూ జగన్ ప్రధానంగా “సిద్ధం” సభల్లో గట్టిగా చెప్పారు. జనాల్లోనూ అంతకంటే గట్టిగా రియాక్షన్ వచ్చింది!
మరోపక్క… ఓటర్లను వాడూ వీడూ, వెదవ, అంటూ సంబోధించే నేతలు రంగంలోకి దిగిన పరిస్థితి. బీసీల తోకలు కత్తిరిస్తా.. గంగపుత్రుల తోలు వలుస్తా.. ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా.. అని చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ ఆయా సామాజికవర్గాలతో పాటు.. విజ్ఞత ఉన్న ప్రతీ ఒక్కరి చెవుల్లోనూ రీసౌండ్ వస్తున్నాయని చెబుతున్నారు. ఈ సమయంలో జగన్ ఒక టిప్పర్ డ్రైవర్ కి అసెంబ్లీ టిక్కెట్ ఇచ్చారు. అయితే… ఈ విషయాన్ని చంద్రబాబు తనదైన శైలిలో నవ్వుతూ ఎద్దేవా చేశారు.
అవును… అనంతపురం జిల్లా శింగనమల నుండి ఈసారి పార్టీ సామాన్య కార్యకర్త, టిప్పర్ డ్రైవర్ అయిన వీరాంజనేయులును వైసీపీ తరపున బరిలోకి దింపారు జగన్. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన జొన్నలగడ్డ పద్మావతిని పక్కనపెట్టి మరీ జగన్.. వీరాంజనేయులుకు టికెట్ కేటాయించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. దీంతో… నేతలు నేతలుగానే ఉండటం కాదు.. కార్యకర్తలు కూడా నేతలుగా మారాలనే సిద్ధాంతాన్ని జగన్ నమ్మారనే కామెంట్లు వినిపించాయి.
ఈ నేపథ్యంలో ఆ ప్రాంతానికి పార్టీ ప్రచారానికి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఈ విషయంపై తనదైన శైలిలో స్పందించారు. ఇందులో భాగంగా… “ఎడమ చేతి వేలిముద్ర వేయించుకోవడానికి టిప్పర్ డ్రైవర్ కు టిక్కెట్ ఇచ్చాడు. గొప్పోడయ్యా.. ఆయన తెలివి తేటలకు ధన్యవాదాలు.. శభాష్” అంటూ స్పందించారు! దీంతో… చంద్రబాబు పెత్తందారీ మనస్థత్వానికి ఇవి తాజా ఉదాహరణ అనే కామెంట్లు వినిపించాయి.
వాస్తవాన్నికి రామాంజనేయులు గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త సాంబశివారెడ్డి వద్ద టిప్పర్ డ్రైవర్ గా పనిచేశారు. మరోపక్క వైసీపీలో చురుకుగా ఉండటంతో… వీరాంజనేయలుకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు జగన్. ఈ సమయంలో… తాజాగా ఆయన నామినేషన్ వేశారు. ఈ క్రమంలో… చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా ఆయన టిప్పర్ నడుపుకుంటూ రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం వరకు వెళ్లి తన నామినేషన్ పత్రాలను అందజేశారు.
దీంతో… ఈ ఒక్క చర్యతో చంద్రబాబు గట్టిగా ఇచ్చిపడేసిన వీరాంజనేయులు అని ఒకరంటే… రేపు విజయోత్సవ ర్యాలీ కూడా టిప్పర్ నడుపుతూనే చేయాలని… అది పెత్తందారీ మనస్తత్వాలున్న వారికి చెంపపెట్టు అవుతుందని కామెంట్లు చేస్తున్నారు వైసీపీ కార్యకర్తలు. ఏది ఏమైనా… ఒక టిప్పర్ డ్రైవర్ కు ఎమ్మెల్యే టిక్కెట్ దక్కడంపై చంద్రబాబు అలా స్పందించి ఉండకూడదనేవారే ఎక్కువగా కనిపిస్తున్నారని అంటున్నారు. ఈ సమయంలో రామాజనేయులు గెలిస్తే… బాబు పరిస్థితి ఏమిటనేవారూ లేకపోలేదు!!