చరిత్రలో తనకు ఒక పేజీ కావాలంటున్న కేసీఆర్

KCR wants to create history with new secretariat
కేసీఆర్ పట్టుబడితే పరిణామాలు ఎలా ఉంటాయో అనేక సందర్భాల్లో రుజువైంది.  ఉదాహరణకు కాళేశ్వరం ప్రాజెక్ట్.  తెలంగాణలోని ప్రతి ఎకరాన్ని గోదావరి నీటితో తడపాలని సంకల్పించుకున్న కేసీఆర్ అసాధ్యమనుకున్న పనిని సుసాధ్యం చేసి గోదావరి జలాలను 618 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోసి చూపించారు.  ఆయన ఉక్కు సంకల్పం చూసి జనం సైతం ఔరా.. అన్నారు.  ఇప్పుడు అదే స్థాయి సంకల్పాన్ని కొత్త సచివాలయం విషయంలో చూపుతున్నారు కేసీఆర్.  పాత సచివాలయం భవనం ఇంకొన్నేళ్లు మన్నుతుందని నిపుణులు, నివేదికలు చెబుతున్నా, ప్రతిపక్షాలు విమర్శించినా కోర్టుల్లో పోరాడి మరీ కూల్చివేతకు అనుమతులు తెచ్చుకున్నారు. 
 
యుద్ద ప్రాతిపదికన కూల్చివేత పనులు చేపట్టారు.  రేపో, మాపో పాత భవంతుల నేలమట్టం పూర్తవుతుంది.  ఈలోపు కొత్త భవనానికి నమూనాను సిద్దం చేయాలనే ఆలోచనలో ఉన్నారు సీఎం.  అందుకే ఆర్కిటెక్టులు, ఆర్ అండ్ బీ అధికారులతో వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.  ఇదివరకే ఫైనల్ డిజైనుకు మార్పులు చెప్పిన కేసీఆర్ ఆ మార్పులతో వచ్చిన ఆర్కిటెక్టులకు నిన్నటి సమీక్షలో మరికొన్ని మార్పులు చెప్పారట.  నూతన భవనం తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఉండాలనేది ఒక ఉద్దేశ్యమైతే రాష్ట్ర చరిత్రలో అద్భుతమైన సచివాలయం కట్టిన ముఖ్యమంత్రిగా తన పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలనేది ఆయన ఉద్దేశ్యం. 
 
ఈ విషయాన్ని బయటకు చెప్పకపోయినా స్పష్టంగా అర్థమవుతూనే ఉంది.  అందుకే ఆయన రాష్ట్రం కరోనా కష్టాలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కొత్త సచివాలయం కోసం 500 కోట్లు కేటాయించారు.  అవీ చాలకపోతే ఇంకో 50 కోట్లు కేటాయించడానికి వెనకాడేలా లేరు.  ఈ కొత్త భవనంలో ఇది లేదు అది లేదు అని లేకుండా సకల సౌకర్యాలు ఉండాలనేది నిబంధన.  మంత్రులు, ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, సలహాదారుల చాంబర్లు కూడా అన్ని సౌకర్యాలతో ఉండాలని, ప్రతి అంతస్తులో డైనింగ్‌ హాల్‌, మీటింగ్‌ హాల్‌, సందర్శకుల కోసం వెయిటింగ్‌ హాల్‌ తప్పనిసరి అని అన్నారట.  మరీ ముఖ్యంగా భవన సముదాయంలోకి వచ్చే అన్ని వాహనాలకు ఖచ్చితమైన పార్కింగ్‌ సౌకర్యం ఉండేలా నిర్మాణం ఉండాలని మరీ మరీ చెప్పారట.  మొత్తానికి కేసీఆర్ తాన హయాంలో నిర్మితమయ్యే సచివాలయానికి చరిత్రలో ఒక పేజీ ఉండాలని గట్టిగా నిర్ణయించుకుని పనిచేస్తున్నారు.