KTR: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తరచూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. రేవంత్ రెడ్డి పరిపాలన విధానం ఆయన వ్యవహార శైలిపై కేటీఆర్ మండిపడుతూ సోషల్ మీడియా వేదికగా మీడియా సమావేశాలలో రేవంత్ రెడ్డి పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. తాజాగా కొడంగల్ నియోజకవర్గంలో లగచర్ల గ్రామ పరిసర ప్రాంతాలలో ఏర్పాటు చేయబోయే ఫార్మాసిటీ గురించి రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఇక్కడ ఫార్మాసిటీ ఏర్పాటు చేయబోతున్నారని భూసేకరణ కూడా జరిపించారు అయితే ఈ కార్యక్రమంలో భాగంగా లగచర్ల గ్రామస్తులు అధికారులపై దాడి చేయడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది. అయితే ఈ వివాదాలు అనంతరం రేవంత్ రెడ్డి మరోసారి ఈ ఫార్మాసిటీ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యల పట్ల కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ మండిపడ్డారు.
ఇటీవల రేవంత్ రెడ్డి కొడంగల్ ఫార్మాసిటీ కంపెనీ గురించి మాట్లాడుతూ అక్కడ ఏర్పాటు చేయబోయేది ఫార్మసిటీ కాదని ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మించబోతున్నామని తెలిపారు. ఏ విధమైనటువంటి కాలుష్యం లేకుండా తన సొంత నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఈ కారిడార్ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. ఈ కారిడార్ వల్ల ఎంతో మంది యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని రేవంత్ రెడ్డి తెలియచేశారు.
కొద్ది రోజుల వ్యవధిలోనే రేవంత్ రెడ్డి మాట మార్చడం పట్ల కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ..అది నోరైతే నిజాలు వస్తాయి.. అదే మూసీ అయితే మాయమాటలే వస్తాయని, పిల్ల చేష్టలు, గారడీ మాటలు, లక్ష్యం లేని చర్యలతో రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో మీ ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ చూస్తేనే
కొడంగల్ లో భూసేకరణ ఫార్మా విలేజ్ ల కోసం అని స్పష్టంగా వెల్లడిస్తుందని చెప్పారు. ఫార్మా క్లస్టర్ ఏర్పాటు చేస్తామని పలుమార్లు, పలు వేదికల మీద ప్రకటనలు చేశారని కేటీఆర్ పేర్కొన్నారు. ఇక ఫార్మాసిటీ కోసం భూసేకరణలో భాగంగా అధికారులతో అక్కడికి వెళ్లి రైతులపై దాడి చేయించి రైతులను అక్రమంగా అరెస్టులు చేయించారు.
ఇంత చేస్తూ ఇప్పుడు అక్కడ నిర్మించబోయేది ఫార్మసిటీ కాదని ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ మాటమార్చి ఎవర్నీ పిచ్చోళ్లను చేస్తున్నారని, చెప్పెటోడికి వినేవాడు లోకువ అన్నట్లు అబద్దాలతో అధికారంలోకి వచ్చిన నువ్వు అబద్దాలతోనే కాపురం చేస్తూ కాలం వెల్లదీస్తున్నావని కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.