బీజేపీ యెటకారం: విశాఖ ఉక్కు.. మందుబాబుల హక్కు.!

Vizag Steel labeled Liqor On The Way

Vizag Steel labeled Liqor On The Way

నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్నట్టు తయారైంది ఆంధ్రపదేశ్‌లో రాజకీయం. ప్రత్యేక హోదా కావాలా.? ఇదిగో, ప్రత్యేక హోదా మద్యం బ్రాండు.. మూడు రాజధానులు కావాలా.? ఇదిగో త్రీ క్యాపిటల్స్ మద్యం బ్రాండు. ప్రెసిడెంట్ మెడల్ సహా కుప్పలు తెప్పలుగా చాలా మద్యం బ్రాండ్లు ఏపీలో అందుబాటులోకి వచ్చేశాయ్. వీటిల్లో కొన్ని ఫేక్ ప్రచారాలే అయినా, చాలావరకు చిత్ర విచిత్రమైన మద్యం బ్రాండ్లు ఏపీలో చక్కర్లు కొడుతున్నాయన్నది నిర్వివాదాంశం.

దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలోనూ లేని ‘మద్యం చిత్రం’ ఆంధ్రపదేశ్‌కి మాత్రమే సొంతమైందంటే.. రాష్ట్రంలో మద్యం పాలసీ ఎంత చెత్తగా వుందో అర్థం చేసుకోవచ్చు. ‘మాకు మెరుగైన బ్రాండ్లు అందుబాటులోకి తీసుకురాకపోతే, మేం వేసే చివరి ఓటు ఇదే అవుతుంది..’ అంటూ మునిసిపల్ ఎన్నికల్లో ఏకంగా మద్యం బాబులు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసే స్థాయికి వెళ్ళింది పరిస్థితి. ఇక, ఇప్పుడు.. ‘విశాఖ ఉక్కు.. మందు బాబుల హక్కు’ అనే రీతిలో కొత్త మద్యం బ్రాండు ఏపీలో అందుబాటులోకి రాబోతోందట. అలాగని జోస్యం చెప్పారొక బీజేపీ నేత. విశాఖ ఉక్కుపై ఓ న్యూస్ ఛానల్ చర్చా కార్యక్రమంలో రాజకీయ పార్టీల నేతల మధ్య వాడి వేడి వాగ్యుద్ధం చోటు చేసుకుంది. షరామామూలుగానే విషయం పక్కదోవ పట్టేసింది. టీడీపీ – వైసీపీ (పట్టాభి, రవిచంద్రారెడ్డి) పరస్పర విమర్శలు మొదలెట్టాయి. కేంద్రంలోని బీజేపీ అదినాయకత్వం వద్ద మోకరిల్లారంటూ టీడీపీ, వైసీపీ పరస్పర దూషణలకు దిగాయి. ఈ క్రమంలో తన ప్రసంగం మొదలెట్టిన బీజేపీ నేత బాజీ, ‘రాష్ట్రంలో త్వరలో విశాఖ స్టీలు ప్లాంటు పేరుతో మద్యం బ్రాండు రాబోతోంది..’ అంటూ యెటకారం చేశారు. దాంతో, ఒక్కసారిగా అంతా ఆశ్చర్యపోయారు.. చూస్తున్న ప్రజలతో సహా. బీజేపీ నేత యెటకారం చేశారని కాదుగానీ.. ఏమో, రాష్ట్రంలో అలాంటి బ్రాండ్ మద్యం అందుబాటులోకి వచ్చినా రావొచ్చు.