Pawan – Vangalapudi Anitha: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల భారీగా నిధులు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పలువురు మంత్రుల సమక్షంలో ఆమె పవన్‌కు పుష్పగుచ్ఛం అందించి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
పాయకరావుపేటకు నిధుల వెల్లువ హోంమంత్రి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం రూ. 18.16 కోట్లను మంజూరు చేసింది. ఈ నిధులతో నియోజకవర్గంలోని 13 గ్రామీణ ప్రాంత రోడ్లను బాగుచేయనున్నారు. తన నియోజకవర్గ అభివృద్ధికి సహకరించినందుకు గాను ఆమె డిప్యూటీ సీఎంకు స్వయంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

ఫేజ్-1లో రూ. 2123 కోట్లు విడుదల రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ రోడ్ల దుస్థితిని రూపుమాపేందుకు ప్రభుత్వం తొలి విడత (ఫేజ్-1) కింద రూ. 2123 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో చేపట్టబోయే పనులు.
రాష్ట్రంలోని 26 జిల్లాల్లో విస్తరించి ఉన్న 157 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పనులు జరగనున్నాయి.
మొత్తం 484 మండలాల్లో 1,229 రోడ్లను (4,007 కిలోమీటర్ల మేర) అభివృద్ధి చేయనున్నారు.
వీటితో పాటు 4 బ్రిడ్జిల నిర్మాణానికి కూడా నిధులు కేటాయించారు.

గత ప్రభుత్వ వైఫల్యాలపై దృష్టి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అత్యంత దారుణంగా మారిందని, అప్పట్లో దీనిపై టీడీపీ, జనసేన, బీజేపీలు తీవ్ర పోరాటం చేశాయని కూటమి నేతలు గుర్తు చేస్తున్నారు. నాడు సోషల్ మీడియాలో వైరల్ అయిన రోడ్ల ఫోటోలు, వీడియోలు ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం.. వాహనదారుల ఇబ్బందులను తొలగించి, మెరుగైన రవాణా సౌకర్యాలను కల్పించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది.

