ఏపీలో స్క్రబ్ టైఫస్ మృత్యుఘంటికలు.. భారీగా మరణాలు.. ప్రజల్లో భయాందోళన..!

ఏపీలో స్ర్కబ్ టైఫస్ ఆందోళన కలిగిస్తోంది. తాజాగా స్క్రబ్ టైఫస్ గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లో వరుస మరణాలతో ప్రజలను వణికిస్తోంది. ఈ వ్యాధితో చికిత్స పొందుతూ ఆదివారం మరో ఇద్దరు మహిళలు మృతి చెందడంతో, మొత్తం మృతుల సంఖ్య మూడు దాటింది. రెండు జిల్లాలకు చెందిన ఈ మహిళల మృతితో ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కొమెరపూడికి చెందిన లూరమ్మ (59), బాపట్ల జిల్లా డేగావారిపాలేనికి చెందిన నాగేంద్రమ్మ (73)గా మృతులను అధికారులు గుర్తించారు. ఇప్పటికే శనివారం రాత్రి ప్రకాశం జిల్లా యర్రగొండపాలేనికి చెందిన ధనమ్మ (64) ఇదే వ్యాధితో మృతి చెందిన విషయం తెలిసిందే. వరుసగా మూడు మరణాలు నమోదు కావడంతో జీజీహెచ్ పరిసరాల్లో తీవ్రమైన టెన్షన్ వాతావరణం నెలకొంది.

లూరమ్మను నవంబర్ 28న తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చేర్చారు. ఆమెకు కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. నాగేంద్రమ్మను అధిక జ్వరం, అనారోగ్య లక్షణాలతో ఆసుపత్రికి తరలించారు. ఇద్దరికీ నిర్వహించిన పరీక్షల్లో స్క్రబ్ టైఫస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యులు వెల్లడించారు. పలు రోజుల చికిత్స అనంతరం ఇద్దరూ ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబాల్లో తీవ్ర విషాదం అలముకుంది.

ఇప్పటికే ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా సుమారు 50 స్క్రబ్ టైఫస్ కేసులు నమోదవడంతో అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. గుంటూరు జీజీహెచ్‌లో ప్రత్యేకంగా స్క్రబ్ టైఫస్ వార్డును ఏర్పాటు చేసి బాధితులకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రత్యేక వార్డులో 14 మంది రోగులు చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

వ్యాధి మరింత వ్యాప్తి చెందకుండా చేయడంలో భాగంగా క్షేత్రస్థాయిలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. పరిసరాల పరిశుభ్రత, పాడుబడిన ప్రదేశాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు, ఎలుకలు, పురుగుల నియంత్రణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు.

ఇటీవల కాలంలో చిన్న జ్వరం అనిపించినా కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. హఠాత్తుగా వచ్చే జ్వరం, తల నొప్పి, ఒళ్లు నొప్పులు, ఒంటి మీద గాయంలా మచ్చ కనిపించడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. సమయానికి చికిత్స పొందితే ఈ వ్యాధిని పూర్తిగా నియంత్రించవచ్చని వైద్యులు భరోసా ఇస్తున్నారు.