ఇక కొట్లాట అనవసరం. తమ భూముల్ని రాజధాని అమరావతి కోసం ఇచ్చిన రైతులు, ప్రభుత్వంతో వీలైనంత త్వరగా చర్చల ప్రక్రియ ప్రారంభించాల్సిందే. చంద్రబాబుని నమ్మకుంటే ఇక అంతే సంగతులు. ‘బెజవాడలో గెలిచి చూపండి. మీరు గెలిస్తే, అమరావతి విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాన్ని మేం ఇకపై తప్పుపట్టడానికి వుండదు.. మీ వాదనే కరెక్ట్ అని మేం నమ్ముతాం..’ అని చంద్రబాబు, మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో చెప్పుకొచ్చారు. చంద్రబాబు సంగతి సరే, అమరావతి రైతులు ఇప్పుడు ఏం చేస్తారన్నదే కీలకంగా మారింది. ‘అమరావతి విషయంలో మా వైఖరి సుస్పష్టం. అమరావతి రైతులు వాస్తవాలు తెలుసుకుని, తమకు ఏం కావాలో ప్రభుత్వానికి తెలపాలి.. ముఖ్యమంత్రి మీద విమర్శలు చేయడం, ప్రభుత్వం మీద నిందలేయడం మానేసి.. ప్రభుత్వానికి సహకరించాలి..’ అని పలువురు మంత్రులు కూడా నిన్నటి గెలుపు తర్వాత హుందాగా విజ్ఞప్తి చేశారు.
అమరావతిలో శాసన రాజధాని అయినా అభివృద్ధి చెందాలి. అలా జరగాలంటే, రైతులు ప్రభుత్వానికి సహకరించడం తప్పనిసరి. రెండేళ్ళయ్యింది అమరావతి ఎదుగూ బొదుగూ లేకుండా పోయింది. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందాన తయారైన అమరావతి అభివృద్ధి ముందు ముందు పరుగులు పెట్టాలంటే, అక్కడ ఉద్యమాల తీవ్రత వుండకూడదు. ఏడాదిగా అమరావతిలో ఉద్యమ సెగలు కనిపిస్తున్నాయి. వాటివల్ల అమరావతికి ఒరిగింది శూన్యం. ‘చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వస్తారు.. అప్పటిదాకా ఉద్యమాన్ని నడిపిస్తాం..’ అనే భావనలో ఇన్నాళ్ళూ అమరావతి రైతులు వున్నారు. అలాంటి ఆలోచనలే ఇకపైనా కొనసాగిస్తే, అది రాష్ట్రానికే నష్టం. అమరావతితోపాటు మరో రెండు రాజధానులు అభివృద్ధి చేస్తామంటోన్న ప్రభుత్వానికి సహకరించడం రాష్ట్ర పౌరులుగా అమరావతి రైతుల బాధ్యత. తమ భూముల్ని రాజధాని కోసం ఇచ్చిన అమరావతి రైతులు, అందుకు తగ్గ పరిహారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిస్సందేహంగా కోరవచ్చు.