మద్యం తాగే ముందు నేలపై చుక్కలు ఎందుకు చల్లుతారో తెలుసా.. అసలు కారణం ఇదే..!

మందు తాగేముందు చాలామంది తెలియకుండానే చేసే ఒక చిన్న పని.. వారి జీవితం, విశ్వాసాలు, భయాలు, ఆశలను కలిపి చెప్పే ఒక గొప్ప సంప్రదాయానికి ప్రతిరూపం అనే విషయం మీకు తెలుసా.. చాలాచోట్ల గ్లాసు నుంచి తాగే ముందు రెండు, మూడు చుక్కల మద్యాన్ని నేలపై చల్లడం మనం చూసే ఉంటాం. కొందరికి అది అలవాటు.. మరికొందరికి సంప్రదాయం. కానీ దీని వెనుక ఉన్న అర్థం మాత్రం చాలా లోతైనది.

ఈ ఆచారం భారతదేశానికే పరిమితమైందని చాలామంది అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే.. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురాతన సంప్రదాయం. ఈ పద్ధతిని అంతర్జాతీయంగా “లిబేషన్” అని పిలుస్తారు. దేవతలకు, ఆత్మలకు లేదా ప్రకృతి శక్తులకు గౌరవంగా మద్యం లేదా వైన్‌ను మొదట నేలపై అర్పించడం లిబేషన్‌కి అర్థం. ఇది కేవలం తాగడం కాదు.. ఒక నమ్మకం, ఒక ప్రార్థన, ఒక భయభక్తుల ప్రతీకగా మారిపోయింది.

భారతదేశంలో చాలా గ్రామాల్లో ఇప్పటికీ దేవతలకు మద్యాన్ని నైవేద్యంగా సమర్పించే ఆచారం ఉంది. ముఖ్యంగా తాంత్రిక సంప్రదాయాల్లో, శక్తి దేవతలను శాంతింపజేసేందుకు మద్యాన్ని పవిత్రంగా అర్పిస్తారు. ఇలా తాగే ముందు నేలపై మద్యం చల్లడం ద్వారా తనను చెడునుండి కాపాడు అనే అర్థంలో అది ఒక మౌన ప్రార్థనగా మారిందని అనేక మంది విశ్వసిస్తారు.

ఈ ఆచారం భారతదేశం మాత్రమే కాదు… ఈజిప్ట్, గ్రీస్, పురాతన రోమ్ సామ్రాజ్యంలో కూడా బలంగా ఉందంట. యుద్ధానికి వెళ్లే ముందు సైనికులు నేలపై వైన్ చల్లి దేవతలకు నమస్కారం చేసేవారు. తమతో లేని వారి ఆత్మలకు అది అంకితం అని వారు నమ్మేవారు. లాటిన్ అమెరికాలోని క్యూబా, బ్రెజిల్ లాంటి దేశాల్లో దీనిని “పారా లాస్ శాంటోస్” అంటారు.. అంటే పుణ్యాత్ముల కోసం అని అర్థం.

ఫిలిప్పీన్స్‌లో ఈ పద్ధతిని మరో విధంగా అనుసరిస్తారు. అక్కడ తాగే ముందు నేలపై కొంత మద్యం చల్లడాన్ని “పారా సా యావా” అంటారు. దీని అర్థం.. చెడు శక్తులను సంతృప్తి పరచడం. అంటే మనపై దృష్టి పడకూడదని, అపశ్రుతులు జరగకూడదని చేసే ఒక రక్షణ చర్యగా అక్కడ దీన్ని భావిస్తారు. శాస్త్రీయంగా చూస్తే ఇది ఒక నమ్మకం మాత్రమే. కానీ సామాజికంగా, సాంస్కృతికంగా ఇది తరతరాల నుంచి వస్తున్న ఒక ఆచారం. తాత తండ్రి చేసినట్టే.. తండ్రి కొడుకు చేస్తాడు. కొందరికి ఎందుకు చేస్తున్నామో కూడా తెలియదు.. అయినా ఆ పని చేయకుండా గ్లాసు నోటికి వెళ్లదు.

ఈ సంప్రదాయం మనిషి భయానికి, విశ్వాసానికి, ప్రకృతిపట్ల ఉన్న గౌరవానికి అద్దం పడుతుంది. తాను చేస్తున్న పని తప్పేనేమో అన్న లోపలి భయం కూడా ఈ మూడు చుక్కలుగా నేలపై పడుతుందేమో అన్న భావన కూడా ఇందులో దాగి ఉంది. అందుకే ఇది కేవలం తాగే ముందు చేసే చిన్న పని కాదు.. వేలేళ్ల ఆలోచనల ప్రతిబింబం.