Putin: ఏ రష్యా అధ్యక్షుడు పాకిస్థాన్ ఎందుకు వెళ్లరో తెలుసా? కారణం ఇదేనంట..!

నాలుగేళ్ల తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌లో అడుగుపెట్టడం ప్రపంచ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఆయన పర్యటనకు భారత్ ఘన స్వాగతం పలికింది. ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి పుతిన్‌ను ఆత్మీయంగా రిసీవ్ చేసుకున్నారు. ఇరు దేశాల మధ్య రక్షణ, వాణిజ్యం, ఇంధనం, సాంకేతిక రంగాల్లో కీలక ఒప్పందాలు కుదిరాయి. భారత్–రష్యా బంధం మరింత బలపడుతుందని ఇరు నేతలు స్పష్టంగా ప్రకటించారు. ఈ పర్యటనపై వెస్ట్రన్ దేశాలు, అంతర్జాతీయ మీడియా నిశితంగా కన్నేసి పరిస్థితిని గమనిస్తున్నాయి.

అయితే ఈ పర్యటన భారత్‌తో పాటు పాకిస్తాన్‌లోనూ ఆసక్తిని పెంచింది. పుతిన్ భారత్‌కు తరచూ వస్తున్నా, పాకిస్తాన్ వైపు మాత్రం ఎప్పుడూ చూడకపోవడం అక్కడి ప్రజల్లో చర్చకు దారితీసింది. ‘పుతిన్ మన దేశానికి ఎందుకు రావడం లేదు.. అనే ప్రశ్న సోషల్ మీడియా నుంచి టీవీ చర్చల వరకు మార్మోగుతోంది. ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఏ రష్యన్ అధ్యక్షుడు పాకిస్తాన్ అధికారిక పర్యటనకు రాకపోవడం ఆ దేశాన్ని మరింత అసహనానికి గురిచేస్తోంది.

ఈ అంశంపై పాక్ జర్నలిస్ట్‌, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అర్జూ కజ్మీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. పాకిస్తాన్ విషయానికొస్తే దేశ ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని, ఇదే పుతిన్ పాక్‌ వైపు చూడకపోవడానికి ప్రధాన కారణమని ఆయన ఒప్పుకున్నారు. మన ప్రధాని స్వయంగా భిక్షాటన గిన్నెతో మిత్రదేశాల చుట్టూ తిరుగుతున్నామని బహిరంగంగానే చెప్పారు. అలాంటప్పుడు పుతిన్ ఇక్కడికి వచ్చి తన జేబును ఎందుకు ఖాళీ చేయించుకుంటారు.. అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పాకిస్తాన్ రక్షణ విశ్లేషకుడు ఖమర్ చీమా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మనకు రష్యాతో అసలు ఏ వ్యాపారం ఉంది. మనం పుతిన్‌ను ఆహ్వానిస్తే ఫైటర్ జెట్లు అప్పుగా ఇవ్వమని అడుగుతామా.. లేదా చమురును ఉచితంగా ఇవ్వమని వేడుకుంటామా.. భారత్ నగదు చెల్లించి కొనుగోలు చేస్తుంది. కానీ మనం మాత్రం ఎప్పుడూ అప్పులు, వాయిదాలపైనే అడుగుతాం. ఇదే భారత్‌కు, పాకిస్తాన్‌కు మధ్య అసలు తేడా..’ అని కఠిన నిజాన్ని బయటపెట్టారు.

పుతిన్ భారత్‌కు రావడంలో ఎమోషనల్ బంధం కంటే ప్రాక్టికల్ బిజినెస్‌నే ఎక్కువగా చూసుకుంటారని కజ్మీ స్పష్టం చేశారు. రష్యా ఉచితంగా ఇవ్వడానికి సిద్ధంగా లేదు. డబ్బు చెల్లించే దేశాలకే ప్రాధాన్యం ఇస్తుంది. అందుకే భారత్‌కు వస్తోంది అని ఆయన వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ తన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి, నగదు చెల్లించే స్థితికి వస్తే ప్రపంచంలోని శక్తివంతమైన దేశాలన్నీ కూడా మన వైపు చూస్తాయని ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు పాక్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.

భారత్‌తో బలపడుతున్న రష్యా సంబంధాలు ఒకవైపు, పాకిస్తాన్‌లో పెరుగుతున్న రాజకీయ, ఆర్థిక అసంతృప్తి మరోవైపు… పుతిన్ పర్యటన ఇప్పుడు పాక్‌కు అద్దంలా మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.