AP Assembly Sessions: శాసనమండలిలో బొత్స వర్సెస్ మంత్రి అచ్చెన్న

AP Assembly Sessions

ఆంధ్రప్రదేశ్ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శాసనమండలిలో రైతుల సమస్యలపై చర్చించేందుకు వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. పంటలకు మద్దతు ధర, యూరియా కొరత వంటి సమస్యలపై చర్చించాలంటూ చైర్మన్ మోషేన్‌ రాజుకు వాయిదా తీర్మానం అందించారు. అయితే ఈ తీర్మానాన్ని ఆయన తిరస్కరించడంతో వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. అధికార సభ్యులు విగ్వాదానికి దిగడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో కాసేపు మండలిని చైర్మన్ వాయిదావేశారు.

రైతుల సమస్యలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని శుక్రవారం దీనిపై చర్చ జరుపుదామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అయితే ఇప్పుడే చర్చ చేపట్టాలని మండలి విపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పట్టుబట్టారు. ప్రభుత్వం రైతుల సమస్యలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు.. ఇప్పుడే చర్చ చేపట్టవచ్చు కదా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వంలో రైతులు ఇలా రోడ్డెక్కి ఆందోళన చేశారా అని నిలదీశారు. తమ హయాంలో రైతులకు ఎలాంటి సమస్యలు లేవని.. యూరియా కోసం ఆందోళనలు చేయలేదని గుర్తు చేశారు. రైతాంగం బాగోగులు గురించి ఆలోచిస్తున్నాం కాబట్టే రైతుల సమస్యలపై చర్చ కోరుకుంటున్నామని పేర్కొన్నారు. ఇవాళే చర్చ జరపాలని బొత్స డిమాండ్ చేశారు.

కానీ వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. యూరియా సహా అన్ని సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రతిపక్ష హోదా లేని కారణంగా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోవడం సరికాదన్నారు. యూరియా కొరత లేకుండా రైతులను ఆదుకున్నామని వివరించారు. తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. ఫేక్ ప్రచారం చేసే సభ్యులకు తమదైన శైలిలో గట్టిగా సమాధానం చెబుతామని స్పష్టం చేశారు. ఏ విషయంలోనైనా ప్రభుత్వం చర్చించడానికి సిద్ధంగా ఉందని అచ్చెన్న వెల్లడించారు.