JanaSainiks Attack: రెచ్చిపోతున్న జనసైనికులు.. దేనికి సంకేతం..?

JanaSainiks Attack

జనసైనికులు రెచ్చిపోయారు. తమకు అండగా నిలుస్తారని భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలపై కూటమి నేతలు, కార్యకర్తలు విరుచుకుపడుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు. ఇందుకేనా మిమ్మల్ని గెలిపించిందని ప్రజలు రగలిపోతున్నారు. ఓవైపు అవినీతిలో ఎమ్మెల్యేలు పోటీ పడుతుంటే.. మరోవైపు కార్యకర్తలు తామేమీ తక్కువా అన్నట్లు అడ్డు చెప్పిన వారిపై కర్కశంగా ప్రవరిస్తున్నారు. తాజాగా మచిలీపట్నంలో ఆర్ఎంపీ వైద్యుడిపై జనసైనికులు చేసిన పాశవిక దాడిని ఉదాహరణగా చెబుతున్నారు వైసీపీ నేతలు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరుపై మండిపడుతున్నారు.

దళిత యువకుడిపైనా దాడి..

అసలు ఏం జరిగిందంటే.. మచిలీపట్నం మండలం సత్రంపాలేనికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు గిరిధర్‌ ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ప్రభుత్వం పాలనపై విమర్శలు చేశారు. సుగాలి ప్రీతి కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించారు. ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జనసైనికులు ఆగ్రహంతో ఊగిపోయారు. గిరిధర్ ఇంటిపై దాడి చేశారు. ఆయనను అరెస్ట్ చేయాలంటూ ధర్నాకు దిగారు. అంతేకాకుండా ఆయన చేత బలవంతంగా పవన్ కళ్యాణ్‌కు క్షమాపణలు చెప్పారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అంతేకాకుండా గిరధర్ ఇంటి పక్కనే ఉన్న సతీష్ అనే దళితుడిపైనా దాడికి పాల్పడ్డారు.

దాడిని తీవ్రంగా ఖండించిన జగన్..

ఈ దాడిని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్రంగా ఖండించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఫోన్‌లో పరామర్శించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఆరా తీశారు. ధైర్యం కోల్పోవద్దని..తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే అవసరమైతే మెరుగైన వైద్యం అందించాలని పార్టీ నేతలకు సూచించారు. అక్రమ కేసులు, దాడులతో ఇబ్బంది పెడుతున్న తీరును బలంగా ఎదుర్కొంటామని తెలిపారు. పోలీసులను అడ్డుపెడ్డుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడటం దారుణమని జగన్ మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అంటూ నిలదీశారు. భవిష్యత్తులో తమ పార్టీ అధికారంలోకి రాగానే కూటమి నేతలకు తగిన బుద్ధి చెబుతామని వార్నింగ్ ఇచ్చారు.

భయోత్పత వాతావరణంపై విమర్శలు..

ప్రశ్నిస్తాం.. అవినీతిని నిర్మూలిస్తాం.. సమర్థవంతమైన పాలన అందిస్తామని గొప్పలు చెప్పే పవన్ కళ్యాణ్.. ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడ్డాలని జనసైనికులకు సూచించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనసైనికులను కంట్రోల్ చేయకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని మేధావులు, రాజకీయ విశ్లేషకులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రభుత్వం వైఫల్యాలను ప్రశ్నించిన ఆర్ఎంపీ వైద్యుడిపై జనసైనికులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. అధికారం అండ చూసుకుని ఇలాగే భయోత్పత వాతావరణం సృష్టించండపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో ప్రజలు కూటమి పార్టీలకు బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలపై నిలదీస్తే దాడులు చేయడం దేనికి సంకేతమని ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇలా దాడులు చేయడం సరైన పద్ధతి కాదని చెబుతున్నారు. ఇప్పటికైనా పాలనపై దృష్టి పెట్టి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సూచిస్తున్నారు.