Amaravati Protest : అమరావతి ఉద్యమం ఇంకా కొనసాగుతూనే వుందా.?

Amaravati Protest : అమరావతి ఎక్కడ.? అమరావతి ఉద్యమమెక్కడ.? గత కొద్ది రోజులుగా అమరావతి పేరుతో పెద్దగా రచ్చ జరగడంలేదు. కాదు కాదు, ఆ రచ్చ మీడియాకి కనిపించడంలేదంతే. ఉద్యోగుల ఉద్యమం నేపథ్యంలో అమరావతి వ్యవహారం అటకెక్కింది. అయితే, అమరావతి రైతులు మాత్రం తమ ఉద్యమాన్ని షరామామూలుగానే కొనసాగిస్తున్నారు.

అసలు అమరావతి ఉద్యమం ఎవరి కోసం.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. రెండేళ్ళకు పైగానే అమరావతి రైతులు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఏకైక రాజధాని అమరావతి.. అన్నది అమరావతి రైతుల నినాదం. ‘కాదు కాదు, మూడు రాజధానులు..’ అంటూ అమరావతిపై వైసీపీ నేతలు, కొందరు మంత్రులు అత్యంత జుగుప్సాకరమైన విమర్శలు చేశారు.

అమరావతిలో అవినీతి జరిగిందన్నారు.. ఇంకోటన్నారు. కానీ, ఏ అవినీతి కూడా ఇప్పటిదాకా బయటకు రాలేదు. కోర్టుల్ని చంద్రబాబు అండ్ టీమ్ మేనేజ్ చేయడం వల్లే ఈ దుస్థితి.. అన్న ఆరోపణలు వైసీపీ నుంచి వున్నాయనుకోండి.. అది వేరే సంగగతి.

ఇదిలా వుంటే, మూడు రాజధానుల నిర్ణయం నుంచి కొన్నాళ్ళ క్రితమే వైఎస్ జగన్ సర్కార్ వెనక్కి తగ్గింది. మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకుంది. అయితే, వచ్చే బడ్జెట్ సమావేశాల్లో మళ్ళీ మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో అమరావతి రైతుల మరోమారు ఉధృతంగా ఉద్యమించేందుకు సన్నద్ధమవుతున్నారట.

ఇప్పటికి సుమారు 780 రోజులకు పైనే అమరావతిలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఇదొక సుదీర్ఘ ఉద్యమం. కానీ, ఈ ఉద్యమం విజయతీరాలకు చేరుతుందా.? అన్నది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నే.