Cell Phone: 58 ఏళ్ల క్రితమే ‘సెల్ ఫోన్’ సంచలనం..! ఫొటో వైరల్..

Cell Phone: సరిగ్గా 20 ఏళ్ల క్రితం.. 2001లో ఒన ఊరిలో, పక్క వీధిలో ఉన్నవారికి ఫోన్ చేయాలంటే లోకల్ కాల్ చేయాలి. కాయిన్ బాక్స్ లో 1రూపాయి కాయిన్ వేస్తే 180 సెకన్లు మాట్లాడొచ్చు. 50 కిమీ దాటితే ఎస్టీడీ కాల్సే దిక్కు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6;30 మధ్యలో కొన్ని నిముషాలు మాట్లాడితేనే బిల్లు పరిగెట్టేది. 6:30 తర్వాత ¼, 8 దాటాక ¾, 10:30 నుంచి ఉదయం 6 వరకూ ½ బిల్లింగ్ వచ్చేది. దీనికోసం ఎస్టీడీ బూత్ దగ్గర భారీ క్యూలు ఉండేవి. ఎంతోమందికి ఎస్టీడీ బూత్ ఉపాధి కల్పించేవి. కానీ.. పదేళ్లకే ఎస్టీడీ బూత్ లు తగ్గిపోతే. 2021కి జ్ఞాపకాలయ్యాయి. ఇందుకు కారణం ‘సెల్ ఫోన్’.

దాదాపు 1996 నుంచి ఇంటికో ల్యాండ్ ఫోన్ నుంచి అరచేతిలో పట్టే సెల్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. మనిషికి ఒకటి కాదు రెండు కూడా వాడేస్తున్నారు. కాల్ రేట్లు తగ్గిపోయాయి. ప్రపంచమే అరచేతిలోకి వచ్చింది. ఉదయం నిద్ర లేవగానే దేవుడు, తల్లిదండ్రులు కాదు.. సెల్ ఫోన్ చూడటం కామన్ అయింది. డిజిటల్ పరిజ్ఞానంతో సెల్ ఫోన్లు ఇంతటి సంచలనం రేపుతాయని 58 ఏళ్ల క్రితమే చెప్పిందో సంస్థ. ఆ వార్త వచ్చిన 33 ఏళ్లకు భారత్ లో సెల్ ఫోన్ వచ్చింది. 1963లో అమెరికాకు చెందిన మ్యాన్ ఫీల్డ్ టెలిఫోన్ కంపెనీ తన న్యూస్ జర్నల్ లో భవిష్యత్తు ఫోన్ విప్లవంపై ఓ వార్త ప్రచురించింది.

‘భవిష్యత్తులో మనిషి జేబులో పట్టేంత ఫోన్లు వాడతారు. వీటిలో కెమెరా, మైక్రోఫోన్, ఇమేజ్, మనుషులు ఒకరినొకరు చూస్తూ మాట్లాడుకుంటారు. అయితే.. ఇది రేపో ఎల్లుండో జరిగేది కాదు. ప్రస్తుతం ప్రయోగాల దశలో ఉంది. దానికంటే ముందు స్పీకర్ ఫోన్లు వస్తాయి. మహిళలు ఇంట్లో వంట చేస్తూ స్పీకర్లో మాట్లాడొచ్చు. ఇదెంతో దూరంలో లేదు’ అని.. టెలిఫోన్ కంపెనీ కమర్షియల్ రిప్రజెంటేటివ్ మిసెస్ జీన్ కోనార్డ్ పాకెట్ సైజ్ వైర్ లెస్ టెలిఫోన్ ను చూపుతున్న ఫొటోను కూడా ప్రచురించారు.

ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సెల్ ఫోన్ ద్వారా ఎన్నో పనులైపోతున్నాయి. సముద్రాల ఆవల ఉన్నవారిని చూస్తూ మాట్లాడేస్తున్నాం.. ఫుడ్ ఆర్డర్లు.. ప్రయాణం, సినిమా టికెట్లు, బ్యాంకింగ్, వార్తలు, సినిమాలు, ఆటలు.. ఇలా మ్యాన్ ఫీల్డ్ కంపెనీ చెప్పినట్టు నిజంగానే ఇదొక విప్లవం అయింది. నిజంగానే మ్యాన్ ఫీల్డ్ టెలిఫోన్ కంపెనీ ఊహించిన విప్లవాన్ని దాటి చాలా ముందుకు వెళ్లింది ‘సెల్ ఫోన్’.