అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. నిన్న పాకిస్తాన్ ఉగ్రవాద నిరోధక చర్యల్లో సహకరించిందని ప్రశంసించిన ట్రంప్, ఇప్పుడు అదే దేశంపై కొత్త ట్రావెల్ బ్యాన్ విధించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ నిషేధం పాకిస్తాన్‌తో పాటు ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలకు కూడా వర్తించనుంది. అమెరికాలో ప్రవేశించే విదేశీయులను కఠినంగా పరిశీలించే విధానం కోసం ట్రంప్ అధ్యక్ష పదవిని చేపట్టిన మొదటి రోజే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చాడు.
దాని ప్రకారం, దేశ భద్రతకు ముప్పుగా కనిపించే దేశాలను గుర్తించి, అక్కడి పౌరుల ప్రయాణాన్ని పూర్తిగా లేదా పరిమిత స్థాయిలో నిలిపివేయాలని ఆదేశించారు. ట్రంప్ తాజా నిర్ణయం విస్తృత చర్చకు దారితీసింది. మంగళవారం అమెరికా కాంగ్రెస్‌లో ప్రసంగించిన ట్రంప్, 2021లో కాబూల్ ఎయిర్‌పోర్ట్ దాడికి కారణమైన తాలిబాన్ ఉగ్రవాది మహమ్మద్ షరీఫుల్లాను పట్టుకోవడంలో పాకిస్తాన్ సహకరించిందని కొనియాడాడు.
అమెరికా సైనికులను లక్ష్యంగా చేసుకుని ఆ దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఉగ్రవాదిని పట్టుకోవడంలో ఇస్లామాబాద్‌తో సమర్థవంతమైన భాగస్వామ్యం ఏర్పడిందని, ఇది రెండు దేశాల మధ్య సంబంధాలకు మేలుకలిగించిందని ట్రంప్ వ్యాఖ్యానించాడు. అయితే, ఒకరోజు లోనే మళ్ళీ ప్లేట్ ఫిరాయించిన ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పాకిస్తాన్ సహా మరికొన్ని దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించే ప్రక్రియను వేగవంతం చేసింది.
ఈ నిర్ణయం త్వరలో అమలులోకి రానుందని, తద్వారా పాకిస్తాన్ పౌరులకు అమెరికాలో ప్రవేశించడం కష్టతరమవుతుందని తెలుస్తోంది. ట్రంప్ అధ్యక్షతన 2017లో ఇరాన్, సిరియా, లిబియా, సోమాలియా వంటి దేశాలపై విధించిన ట్రావెల్ బ్యాన్ తరహాలోనే ఇది అమలవుతుందని అంటున్నారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఇటీవల ట్రంప్ పొగడ్తలకు మురిసిపోయి అమెరికాతో ప్రాంతీయ శాంతి, భద్రత కోసం కలిసి పనిచేస్తామని వ్యాఖ్యానించాడు. కానీ, ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం పాకిస్తాన్-అమెరికా సంబంధాలపై కొత్త దిశలో ప్రభావం చూపనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకపక్క అభినందించి, మరోపక్క నిషేధాలు విధించడం ట్రంప్ పాలనకు ప్రత్యేకమైన లక్షణంగా మారింది.

