మా ప్రభుత్వం పేదల ప్రభుత్వం, పేదరికం నిర్మూలనకు పాటుపడతాం, జీవం ప్రమాణాలను పెంచుతాం, ధరలు తగిస్తాం అంటూ ఏ నాయకుడైనా చెబితే అవన్నీ కాకమ్మ కబుర్లే. ఎన్ని చెప్పినా చివరకు చేసేది సామాన్యుడి నడ్డివిరవడమే. ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యమని, ఆర్ధిక రంగాన్ని మెరుగులపరుచుకుని ప్రపంచంలోనే అగ్రగామిగా దేశాన్ని నిలుపుతామని అరచేతుల్లో వైకుంఠం చూపించిన మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల పక్షపాతిగా మారిపోయింది. బ్యాంకులను, ప్రభుత్వ పరిశ్రమలను నిట్టనిలువునా అమ్మకానికి పెట్టేస్తున్నారు. గత కొన్ని నెలలుగా అమ్ముకోవడమే పనిగా మారింది ప్రభుత్వానికి.
కరోనా కారణంగా దెబ్బతిన్న ఆర్ధిక రంగానికి చేయూతను ఇవ్వడానికి అంటూ ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టారు. అందులో కార్పొరేట్ శక్తులను మేలు చేకూర్చడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. అదే చేస్తున్నారు. కార్పొరేట్ సంస్థలకు పన్నుల్లో రాయితీలు ఇచ్చిన ప్రభుత్వం సామాన్యుల మీద మాత్రం పన్నుల భారాన్ని మోపుతోంది. నిత్యావసరాలైన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను విపరీతంగా పెంచుకుంటూ పోతోంది. పెట్రోల్ దేశంలోని కొన్నిచోట్ల రూ. 100లను తాకుతుండగా హైదరాబాద్లో రూ.92.53గా డీజిల్ 86.55గా ఉంది. వరుసగా వారం నుండి ఈ ధరలు పెరుగుతోనే ఉన్నాయి. ఇక వంట గ్యాస్ మీద తాజాగా రూ.50 పెంచారు. గత మూడు నెలల్లో రూ. 200 పెరిగి ప్రస్తుతం రూ.821.50కు చేరింది. చూడబోతే ఇంకో రెండు నెలలో ఈ మొత్తం రూ.1000కి చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
ఎందుకీ ధరల పెంపు అంటే అలవోకగా ప్రపంచ చమురు మార్కెట్ మీద నెట్టేస్తుంటారు. అక్కడ ధరలు పెరగడం వల్లనే దేశంలోనూ పెరుగుతున్నాయని అంటున్నారు. చమురు మార్కెట్లో ధరలు పెరిగితే ఉన్నపళంగా ఇక్కడ ధరలు పెంచుతున్న ప్రభుత్వం అక్కడ రేట్లు తగ్గుట ఇక్కడెందుకు తగ్గించట్లేదు. సబ్సిడీ పేరుతో హడావుడి చేసిన మోడీ ఇప్పుడు దాన్ని కూడ మూడింట రెండు వంతులకు కుదించేశారు. నిజం ఏంటంటే చమురు మార్కెట్లో ధరలు పెరిగితే ప్రభుత్వం భారీగా లాభపడుతోంది. అందుకే ఎప్పుడెప్పుడు రేట్లు పెరుగుతాయా అని కాచుకుని కూర్చుంటోంది. రేట్లు పెరిగితే రేట్లతో పాటు పన్నులూ పెంచుకుని లక్షల కోట్లు వసూలు చేస్తోంది. చమురు మార్కెట్లో రేట్లు తగ్గించలేరు కాబట్టి కనీసం ధరలు పెరిగేటప్పుడు ప్రభుత్వ పన్నులను తగ్గించ్చుకోవచ్చు కదా. అలా చేయరు. ఎందుకంటే అదే వారికి లాభాలను ఆర్జించిపెట్టేది కాబట్టి.
మరి భారీగా వస్తున్న లాభాలను ఏం చేస్తున్నారయా అంటే కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్నారు. దేశ ఎకానమీ 30 శాతానికిపైగా పడిపోతే కార్పొరేట్ శక్తులు మాత్రం భారీగా లాభాలను ఆర్జించాయి. మరి ఇదెలా సాధ్యం అంటే వారికి పన్నులను గణీయంగా తగ్గించడమే. భారీగా సంపాదించే వారికి పన్నులు తగ్గించి సామాన్యుల మీద పన్నులు పెంచుకుంటూ పోతున్న ఈ ప్రభుత్వ విధానం సామాన్యుడిని దోచి పెద్దవాళ్ళను మరింత పెద్దవాళ్లుగా చేయడం కాకపోతే మరేమిటి.