మహిళలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. ‘బీమా సఖి’ యోజనతో భారీ బెనిఫిట్స్ పొందే ఛాన్స్!

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. 18 నుంచి 70 ఏళ్ల వయసు గల మహిళలను ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ అయిన ఎల్‌ఐసీ ఏజెంట్లుగా మోదీ సర్కార్ నియమించనుంది. కనీసం పదో తరగతి పాసైన వాళ్లు ఈ స్కీమ్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. మహిళల సాధికారత కోసం కొత్త పథకాన్ని కేంద్రం అమలు చేస్తుండటం గమనార్హం.

ఏకంగా 2 లక్షల మంది మహిళలకు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. హరియాణాలోని పానిపట్‌లో మోదీ ఈ స్కీమ్ ను ప్రారంభించారు. బీమా సఖి యోజనలో చేరేందుకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుందని సమాచారం అందుతోంది. ఎంపికైన మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో పాటు మహిళా ఏజెంట్లకు మూడేళ్ల పాటు స్టైపెండ్‌ కూడా అందజేస్తారు.

తొలి ఏడాదిలో నెలకు రూ.7 వేల చొప్పున, రెండో ఏడాది నెలకు రూ.6 వేలు, మూడో ఏడాది నెలకు రూ.5 వేల చొప్పున స్టైపెండ్‌ పొందే అవకాశం ఉంటుంది. శిక్షణ అనంతరం స్టైపెండ్‌తో పాటు కమీషన్‌ కూడా పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పట్టభద్రులైన బీమా సఖులను ఎల్‌ఐసీలో డెవల్‌పమెంట్‌ ఆఫీసర్లుగా నియమించే అవకాశం కూడా ఉండనుందని సమాచారం అందుతోంది.

ఎల్‌ఐసీ స్కీమ్స్ ద్వారా దీర్ఘకాలంలో మంచి బెనిఫిట్స్ పొందే అవకాశం అయితే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాల ద్వారా పాలసీదారులను సైతం భారీ స్థాయిలో పెంచే దిశగా అడుగులు వేస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.