తమిళ దర్శకుడు అట్లీపై కపిల్‌ శర్మ వ్యాఖ్యలు దుమారం.. కమెడియన్‌ను ఏకీపారేస్తున్న నెటిజన్లు!

తమిళ దర్శకుడు అట్లీపై బాలీవుడ్‌ స్టార్‌ కమెడియన్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. తమిళ దర్శకుడు అట్లీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘రాజా రాణి’ సినిమాతో హిట్‌ అందుకొని ‘తేరి’, ‘మెర్సల్‌’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్‌ గా బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌తో ‘జవాన్‌’తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్నాడు.

అయితే ఆయన నిర్మాణంలో వస్తున్న తాజా చిత్రం ‘బేబి జాన్‌’. విజయ్‌ ‘తేరి’ సినిమాకు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాలో వరుణ్‌ ధావన్‌ కథానాయకుడిగా నటిస్తుండగా.. కీర్తి సురేష్‌, వామిక గబ్బి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. కపిల్‌ శర్మ కామెడీ షోకి హాజరైన ఈ చిత్రబృందానికి ఒక చేదు అనుభవం ఎదురైంది. ఈ షోలో భాగంగా.. కపిల్‌ శర్మ అట్లీని అడుగుతూ.. ’’మీరు కథ చెప్పడానికి ఏ స్టార్‌ హీరో దగ్గరికైన వెళ్లినప్పుడు వాళ్లు అట్లీ ఎక్కడున్నారు అని అడిగారా’’ అంటూ కపిల్‌ ప్రశ్నించాడు. అయితే కపిల్‌ మాటల్లోని ఉద్దేశం అర్థం చేసుకున్న అట్లీ తనదైన శైలీలో గట్టిగా సమాధానమిచ్చాడు.

’’ఇలాంటి ప్రశ్న నన్ను ఎందుకు అడుగుతున్నారో నాకు అర్థమైంది. ఈ ప్రశ్నకు నా ఆన్సర్‌ ఒక్కటే. మనకు టాలెంట్‌ ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నాము అనేది పెద్ద విషయం కాదు. నేను ఈ విషయంలో ముందుగా దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌కి ధన్యవాదాలు చెప్పాలి. నా దర్శకత్వంలో వచ్చిన ‘రాజా రాణి’ సినిమాను నిర్మించింది ఆయనే. అతడు నన్ను నమ్మాడు కాబట్టే ఇలా ఉన్నాను. అయితే ‘రాజా రాణి’ కథతో మురుగదాస్‌ దగ్గరికి వెళ్లినప్పుడు అతడు నా కథను మాత్రమే చూశాడు తప్ప నా లుక్‌ ఎలా ఉంది అనేది చూడలేదు. కాబట్టి.. ప్రపంచం కూడా మన పనినే చూడాలి తప్ప.. మన లుక్‌ని బట్టి మనల్ని అంచనా వేయకూడదు’’. అంటూ అట్లీ చెప్పుకొచ్చాడు. అయితే కపిల్‌ శర్మ అట్లీ లుక్స్‌పై కామెంట్‌ చేయడంతో అతడి తీరుపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. కాగా ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.