దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో… బీఆరెస్స్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ను ఈడీ అధికారులు అరెస్ట్ చేస్తున్నారంటూ.. విచారణ సమయంలో రకరకాల కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే అలాంటివేవీ జరగకుండా.. వ్యవహారం కాస్త సైలంట్ గానే ఉంది. అయితే… తాజాగా కవిత అరెస్ట్ కు సంబంధించిన ఒక యానిమేషన్ వీడియో ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తుంది.
కేసీఆర్ అక్రమ సంపాదన, కవిత డబ్బుల మధ్యలో మునిగి ఆనందించడం, కేసీఆర్ జాతీయపార్టీ ప్రకటన, ఆ సంబరాల్లో ఢిల్లీ – పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాలుపంచుకోవడం… మొదలైన అంశాలతో కూడిన సంచలన వీడియో ఒకటి.. బీజేపీ జాతీయ పార్టీకి చెందిన అధికారిక ఇన్ స్టా లో దర్శనమిచ్చింది. 96 సెకన్ల ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఈ యానిమేషన్ వీడియోలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన కుమార్తె కవిత.. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల పాత్రలతో పాటు.. క్లైమాక్స్ లో దర్యాప్తు సంస్థ అధికారి ఒకరు కనిపించటం విశేషం. ఈ వీడియోలోని అంశాల్ని వరుసగా చూస్తే… “తెలంగాణ కా ఖజానా” పేరుతో అప్ లోడ్ చేసిన ఈ వీడియోలో కవిత క్యారికేచర్ ధన రాశుల మధ్య ఉన్నట్లుగా చూపించారు. వీడియోను క్లిక్ చేస్తే.. భారీ భవంతి వద్దకు “టీఆరెస్స్ 51 కేటీఆర్” నెంబరు ప్లేట్ తో ఉన్న కారులో నుంచి దిగుతారు కేసీఆర్ క్యారికేచర్.
అనంతరం… సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ సూట్ కేసు తీసుకొని కేసీఆర్ వెళుతుంటారు.. రైతు బందు, అసరా పెన్షన్, షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మీ… తెలంగాణ సర్కార్ కు చెందిన స్కీముల పేరుతో కేంద్ర నిధులను పక్కదారి పట్టించి.. తన ఖజానా నింపేసుకుంటారు కేసీఆర్ క్యారికేచర్. తర్వాతి సీన్ లో ఖజానా మొత్తం బంగారం, నగల రాసులతో కుప్పలు కుప్పలుగా ఉన్న చోట కవిత క్యారికేచర్ కూర్చొని సంపదను లెక్కిస్తూ… సంబరాలు చేసుకుంటూఉ.. బంగారు నాణాలను పైకి ఎగరేస్తూ ఆడుకుంటూ ఉంటారు.
ఆ టైంలో ఆమె ఎదురుగా ఉన్న ట్రేలో ఏడు ఫోన్లు ఉంటాయి. అవి మోగుతూ ఉంటాయి. వాటిని ఒక్కొక్కటి తీసుకొని చిరాగ్గా.. ఏవో డిలీట్ చేసి, అనంతరం ఆఫ్ చేసి పక్కన పడేస్తుంటారు. రెండు ఫోన్లలో మాత్రం మాట్లాడి ఆ తర్వాత పక్కకు పడేస్తారు. ఈ సమయంలో జీఎస్టీ నిదులను సైతం దాచేసి కేసీఆర్… కుప్పలుగా పోసి ఉన్న నగదు.. బంగారాన్ని లెక్కేస్తూ మురిసిపోతుంటారు. అలా పోగేసిన భారీ ధన రాశులతో జాతీయ పార్టీని ప్రకటిస్తారు.
పార్టీ ప్రకటించిన వేళ.. ఢిల్లీ.. పంజాబ్ ముఖ్యమంత్రులతోపాటు కవిత కూడా చప్పట్లు కొడుతూ హర్షం వ్యక్తం చేస్తారు. అలా ఆనందంగా ఉన్న వేళలో.. వెనుక నుంచి దర్యాప్తు సంస్థల అధికారి ఒకరు వచ్చి.. కవితను తట్టి ఆమెకు బేడీలు చూపిస్తారు. దీంతో కవిత అవాక్కు అవుతారు. అక్కడితో వీడియో ముగుస్తుంది.
దీంతో… ఈ వీడియోతో బీజేపీ ఏం చెప్పదలుచుకుంది? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఢిల్లీమద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను త్వరలో అరెస్టు చేస్తారన్న సంకేతాన్ని యానిమేషన్ వీడియోతో ముందుస్తుగా రివీల్ చేశారనుకోవచ్చా? అంటూ ఆన్ లైన్ లో ప్రశ్నల వర్షాలు కురుస్తున్నాయి.!