అమితాబ్‌, కమల్‌హాసన్‌ లతో నటించడం అదృష్టం : ప్రభాస్

”బుజ్జితో కలిసి భైరవ చేసిన ప్రయాణం ఎంతో ఆసక్తికరం. ఈ పాత్రలతో మూడేళ్లు ప్రయాణం చేశా” అన్నారు ప్రభాస్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కల్కి 2898 ఎ.డి’. దీపికా పదుకొణె కథానాయిక. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌హాసన్‌, దిశా పటానీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించారు. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి.అశ్వనీదత్‌ నిర్మించారు. జూన్‌ 27న సినిమాని విడుదల చేస్తున్నారు. పురాణాలతో ముడిపడిన సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రమిది. ఇందులో భైరవ అనే పాత్రలో కనిపిస్తారు ప్రభాస్‌. బుజ్జి అనే పేరుతో కూడిన వాహనం కూడా కథలో కీలకం.

బుజ్జి, భైరవ పాత్రల్ని పరిచయం చేస్తూ రామోజీ ఫిల్మ్‌సిటీలో బుధవారం రాత్రి వేడుకని నిర్వహించారు. బుజ్జి వాహనాన్ని నడుపుకుంటూ వేదిక మధ్యలోకి వచ్చి అభిమానుల్ని అలరించారు ప్రభాస్‌. ఇదే వేడుకలో ‘బుజ్జి-భైరవ’ టీజర్‌నీ ప్రదర్శించారు. ‘ఇంక తిరిగి వెళ్లేదే లేదు…’ అంటూ ప్రభాస్‌ చేసిన సందడి టీజర్‌కి ఆకర్షణగా నిలిచింది. అనంతరం వేడుకలో ప్రభాస్‌ మాట్లాడుతూ ‘అమితాబ్‌… కమల్‌ హాసన్‌ నటనని చూసి భారతదేశం స్ఫూర్తి పొందింది. అలాంటి గొప్ప నటులతో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం. అమితాబ్‌ బచ్చన్‌లాంటి నటుడు మన దేశంలో ఉన్నందుకు గర్వపడుతున్నా. ఆయన స్ఫూర్తితోనే వచ్చాం మేమంతా. నా చిన్నప్పుడు కమల్‌హాసన్‌ సర్‌ నటించిన ‘సాగరసంగమం’ చూసి అలాంటి దుస్తులు కావాలని మా అమ్మని అడిగి తెప్పించుకున్నా.

ఇందులో ఉన్న మరో అందమైన స్టార్‌ దీపికా పదుకొణె. ఆమెతో కలిసి పనిచేయడం మంచి అనుభవం. దిశా పటానీని హాట్‌ స్టార్‌ అంటుంటారు మా నిర్మాత స్వప్నదత్‌. నిర్మాత అశ్వనీదత్‌ ఈ వయసులోనూ శ్రమించే విధానం చూసి ఎంతో నేర్చుకోవాలనిపిస్తుంది. ఇంత ఖరీదైన సినిమా తీస్తూ కూడా, ఇంకా ఏం చేద్దాం అని అడుగుతుంటారు. ఇంత భారీ సినిమాలు తీస్తూ, ఇన్నేళ్లు పరిశ్రమలో ఉన్నది ఆయనొక్కరేనేమో. తన రెండో సినిమానే ఎన్టీఆర్‌తో చేశారంటే ఆయన స్థాయి ఏమిటో అర్థమవుతుంది. అంతే ధైర్యం, తపనతో పనిచేస్తుంటారు ఆయన కుమార్తెలు స్వప్న, ప్రియాంక. వాళ్లకీ, బుజ్జిని పరిచయం చేస్తున్న దర్శకుడు నాగ్‌ అశ్విన్‌కి కృతజ్ఞతలు. ఈ సినిమా కోసం నేనూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అన్నారు. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ మాట్లాడుతూ ‘పేరు చిన్నదే కానీ, సినిమాలో బుజ్జి మామూలుగా ఉండదు.

సినిమా తీయడమే కష్టం, ఈ సినిమా కోసం ఇంజినీరింగ్‌ కూడా చేయాల్సి వచ్చింది. భవిష్యత్తు కారు నేపథ్యంలో సినిమా అన్నప్పుడు డిజైన్‌ గురించి తర్జన భర్జన పడ్డాం. మహీంద్ర గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రాకు ట్వీట్‌ చేశాక, ఆయన తన బృందాన్ని మాకు పరిచయం చేశారు. వాళ్లంతా చాలా సహకారం అందించారన్నారు. నిర్మాత సి.అశ్వనీదత్‌ మాట్లాడుతూ ‘ఇది విడుదల తర్వాత చాలా పెద్ద సినిమా అవుతుంది అన్నారు.