అంతా ఓటేయడానికి వెళ్లారా… ఎవరు గెలిస్తే నాకేంటి అంటున్న నాగ్‌ అశ్విన్‌!

ప్రభాస్‌ హీరోగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న భారీ బ్జడెట్‌ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ సినిమా నిర్మాత స్వప్నదత్‌ సోషల్‌ విూడియాలో యాక్టివ్‌గా ఉంటూ సరదా పోస్ట్‌లు పెడుతుంటారు. తాజాగా ‘కరెంట్‌ ఎఫైర్స్‌ ఆఫ్‌ వైజయంతి’ అంటూ నాగ్‌ అశ్విన్‌కు తనకు మధ్య జరిగిన సరదా సంభాషణను ఇన్‌స్టాలో రాసుకొచ్చారు.

‘కల్కి’ సీజీ వర్క్‌ చేస్తున్న వారంతా ఓటువేయడానికి హైదరాబాద్‌ నుంచి వాళ్ల ఊర్లకు వెళ్లారు ఇప్పుడెలా.. అని నాగ్‌ అశ్విన్‌ అనగా.. ‘ఎవరు గెలుస్తారేంటి’ అని స్వప్న అడిగారు. దానికి ఆయన సరదాగా బదులిస్తూ..’ఎవరు గెలిస్తే నాకెందుకండీ.. నా సీజీ షాట్స్‌ ఎప్పుడు వస్తాయో అని నేను ఎదురుచూస్తున్నా’ అన్నారు.

దీంతో ‘కల్కి’ గ్రాఫిక్స్‌ వర్క్‌ ఇంకా పెండింగ్ లో ఉన్నట్లు అర్థమవుతోంది. మరోవైపు ఈ చిత్రాన్ని జూన్‌ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ఈలోగా వర్క్‌ అంతా పూర్తి చేయాలని మూవీ యూనిట్‌ ప్రయత్నిస్తుంది. భారీ బడ్జెట్‌తో సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో ఇది తెరకెక్కుతోంది. ఇందులో పలు భాషలకు చెందిన అగ్ర నటీనటులు భాగం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ప్రభాస్‌కు జోడిగా దీపికా పదుకొణె నటిస్తుండగా.. దిశా పటానీ, అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీని కాన్సెప్ట్‌ గురించి దర్శకుడు ఒక సందర్భంలో మాట్లాడుతూ..’మహాభారతంతో మొదలై.. క్రీస్తుశకం 2898లో పూర్తయ్యే కథ ఇది. మొత్తం ఆరు వేల ఏళ్ల వ్యవధిలో ఈ కథ విస్తరించి ఉంటుంది. గతం, భవిష్యత్తుతో ముడిపడిన కథ కాబట్టి అందుకు తగ్గట్టుగా ఆయా ప్రపంచాల్ని సృష్టించడానికి ప్రయత్నించాం’ అన్నారు.