భార్య, ప్రియుడు మధ్యలో భర్త.. అసలు మ్యాటర్ ఇదేనా ?

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య, అక్రమ సంబంధంపై ఆగ్రహించిన భర్తను దారుణంగా చంపిన భార్య, ప్రియుడితో కలవడానికి అడ్డుగా ఉన్నాడని భర్తని కడతేర్చిన భార్య. ఇవే ఈమధ్య కాలంలో తరచూ వింటున్న వార్తలు. భార్యను చంపిన భర్త కధనాలు ఇది వరకు ఎక్కువగా ఉండేవి కానీ ఇప్పుడు రివర్స్ అయింది. భర్తలపై భార్యలు దాడులు చేస్తున్నారు. అక్రమ సంబంధాలకు అడ్డొస్తే అడ్డంగా నరికేస్తున్నారు. భర్తలపై భార్యలు ఇలాంటి దారుణాలకు ఎందుకు పాల్పడుతున్నారు? భర్త ఉండగా మరొక పురుషుడితో సంబంధం ఎందుకు కోరుకుంటున్నారు? వీటిని అరికట్టే మార్గం లేదా? ఒకవేళ ఉంటే ఆ మార్గం ఏంటి. దీనిపై తెలుగు రాజ్యం ప్రత్యేక కధనం.

ఎక్కువశాతం భార్యలు భర్తని చంపటానికి కూడా వెనుకాడకపోవటానికి ప్రధమంగా వినిపిస్తున్న కారణం వివాహేతర సంబంధం అది భార్య వేరొకరితో సంబంధం పెట్టుకోవడం కావచ్చు లేదా భర్త వేరొక స్త్రీతో ఉండటం కావచ్చు. ఈ వివాహేతర సంబంధాలకు దారి తీస్తున్న కారణాలు ఇలా ఉన్నాయి. పెళ్ళికి ముందే లవ్ అఫైర్ ఉండటం, ఏదేని కారణం వలన ఇష్టం లేని పెళ్లి చేసుకోవటం, తెలిసి తెలియని వయసులో పెళ్లిళ్లు జరగటం, డబ్బు మీద ఆశ, ఒకరి మీద ఒకరికి ఇంట్రెస్ట్ తగ్గిపోవటం.

కారణాలు ఎన్ని ఉన్నా సరే పెళ్లి అనే బంధం మీద అవగాహన ఉన్న వ్యక్తులు తప్పుడు దారులు ఎంచుకోరు అంటున్నారు మానసిక నిపుణులు. కొన్ని అధ్యయనాల ప్రకారం భార్య భర్తల మధ్య వచ్చే మనస్పర్థలు అనేక అనర్ధాలకు దారి తీస్తున్నాయట. వారి మధ్య పరస్పర అవగాహన లేకపోవడమే దీనికి కారణం. ఆధునిక యుగంలో బిజీ బిజీ లైఫ్ స్టైల్ వలన పెళ్ళైన జంటల మధ్యన కమ్యూనికేషన్ గ్యాప్ పెరిగిపోతుంది. దీనితో మనుషులుగా ఒకేచోట ఉన్నా మానసికంగా వారి మధ్యన గ్యాప్ ఎక్కువ అయిపోతుంది.

ఒక స్త్రీ వివాహేతర సంబంధం పెట్టుకోవటానికి ఇవే కారణాలు అంటున్నారు నిపుణులు. పెళ్ళై, పిల్లలు పుట్టి వారు స్కూల్ కి వెళ్లేవరకూ భార్యా భర్తల మధ్యన పెద్దగా విబేధాలు ఉండవు. మహిళ ఒంటరిగా ఎప్పుడైతే ఉండటం మొదలెడుతుందో అప్పుడే తను లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటుంది. బయటకి వెళ్లిన భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. భర్త రాగానే తన దినచర్యనో లేదా ఏవో ఊసులు పంచుకోవాలని చూస్తుంది. భర్త తనతో రొమాంటిక్ గా గడపాలి అనుకుంటుందట. కానీ పని ఒత్తిడి కారణంగా భర్త ఆమెను నిర్లక్ష్యం చేస్తూ ఉంటాడు. ఇలా కొన్ని రోజులు గడిచాక ఆమెలో ఒక నిర్లిప్తత మొదలవుతుంది. మానసిక క్షోభకు గురవుతుంది. జీవితం మీద విరక్తి దశలోకి చేరుకుంటుంది.

అప్పుడు తను సంతోషాన్ని వెతుక్కుంటుంది. తన భర్త నుండి తనకి లభించని సంతోషాన్ని పరాయి మగాడి నుండి ఆశిస్తుంది. ఇది ఆసరాగా తీసుకుని కొంతమంది మగాళ్లు పెళ్ళైన ఆడాళ్లకి ఎర వేస్తున్నారు. ఈ విధంగా మొదలైన అక్రమ సంబంధంలోని బంధం ముదిరి భర్తను అడ్డు తొలగించుకునే స్థాయి వరకు వెళ్తోందని చెబుతున్నారు నిపుణులు.

మానసిక నిపుణుల సూచన ఏంటంటే భార్యా భరతలు ఇద్దరు ఒకరి కోసం ఒకరు రోజులో ఒక గంట అయినా సరే సమయాన్ని కేటాయించుకోవాలి. అభిప్రాయాలను గౌరవించుకోవాలి. మీ భర్త లేదా భార్యలో ఏదైనా మంచి క్వాలిటీ ఉంటే అభినందించండి. ఏ పనిలో అయినా ప్రోత్సహించండి. ఆమె చేసిన తప్పుల్ని పదే పదే వేలెత్తి చూపడం మంచిది కాదంటున్నారు నిపుణులు. తప్పుని సరిదిద్దుకోవడానికి అవకాశం, సహకారం ఇవ్వటం ఉత్తమమట. మనస్పర్థలు వచ్చినప్పుడు ఆర్గ్యూ చేయటం మానేసి డిస్కషన్ చేసుకోవటం బెటర్ అంటున్నారు. స్త్రీలు భర్త నుండి కాంప్లిమెంట్స్ ఎక్స్ పెక్ట్ చేస్తారట. మరి అవకాశం వచ్చినప్పుడు ఆమెను పొగడటానికి ఆలోచించకండి. ఆమెకు బాలేనప్పుడు మీరిచ్చే సాంత్వనే ఆమెకు మందులతో సమానమని గుర్తించండి.

మీ భార్య, లేదా భర్తను పెళ్ళైన కొత్తలో ఇంప్రెస్స్ చేయటానికి ఎలా ట్రై చేసేవారో గుర్తుందా..? అవి ఎప్పుడూ కంటిన్యూ చేయండి. నెలకి ఒకసారి అయినా ఆమెతో ఒక రోజంతా పూర్తి స్థాయిలో గడపటానికి ట్రై చేయండి. మీకేదైన సమస్య ఉంటే తనకి చెప్పండి. ఆలా కాకుండా కొంతమంది టెన్సన్స్ అన్నీ లోలోపలే దాచుకుని భార్య అర్ధం చేసుకోవట్లేదంటూ ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. ముందే చెబితే ఆమెకు వీలైతే పరిష్కారం ఇస్తుంది లేదా మీకు ఇంటి ఒత్తిడి తగ్గించే ప్రయత్నం చేస్తుంది. వారంలో రెండు సార్లైనా శృంగారంలో పాల్గొనటం అవసరమట. ఇది ఆరోగ్యానికి, ఒత్తిడి తగ్గటానికి కూడా మార్గమని చెబుతున్నారు వైద్యులు. అలాగే ప్రేమని ఎక్స్ ప్రెస్ చేయమని, ప్రేమని వ్యక్తపరచటంలో శృంగారం కూడా ఒక భాగమని చెబుతున్నారు.

భర్తలే కాదు భార్యలు కూడా ఇవన్నీ పాటిస్తే మనస్పర్థలు దరి చేరవట. ఒకరిపై ఒకరికి అనురాగం పెరిగి బంధం గట్టి పడుతుంది. పరాయి వ్యక్తుల గురించి కలలో కూడా ఆలోచించే అవకాశం తక్కువ అని చెబుతున్నారు మానసిక నిపుణులు. జీవిత సహచరికి కావలసినవి మీ దగ్గర దొరుకుతున్నప్పుడు వేరేవారి గురించి ధ్యాస ఉండదట. ఒకవేళ చిన్న చిన్న లోపాలు ఉన్నా మీరు వ్యక్తపరిచే ప్రేమతో అవన్నీ కొట్టుకుపోతాయట. తెలుసుకున్నారుగా..ఇకపై మీ జీవనశైలిలో, ఆలోచనలో చిన్న చిన్న మార్పులు చేసుకుని పెళ్లి బంధాన్ని పూర్తి స్థాయిలో అనుభవించండి. తర్వాతి తరాలకు ఆదర్శంగా నిలవండి.