మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గురించి ఇటీవలి కాలంలో కుప్పలు తెప్పలుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి.. ఆయన పార్టీ మారుతున్నారంటూ.! కొన్నాళ్ళ క్రితం, అంటే మంత్రి పదవి పోయాక బాలినేని పార్టీని వీడతారంటూ ప్రచారం గట్టిగా సాగింది.
అనుచరులు, అత్యంత సన్నిహితులతో ప్రత్యేకంగా భేటీ అయి, భవిష్యత్ కార్యాచరణ గురించి ఆయన వారితో చర్చించారు కూడా. అయితే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్, బాలినేని శ్రీనివాస్ రెడ్డిని పిలిపించుకుని బుజ్జగించారు.
ఆ తర్వాత కూడా బాలినేని శ్రీనివాస్ రెడ్డి, వైసీపీని వీడే దిశగా తెరవెనుకాల మంత్రాంగం గట్టిగానే నడిపారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ అధినాయకత్వం మళ్ళీ బుజ్జగింపు ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది.
అయితే, పదే పదే ఇదే తంతు అధినాయకత్వానికీ పెద్ద తలనొప్పిగా మారినమాట వాస్తవం. ‘నేను పార్టీని వీడటంలేదు. ఒంగోలు నుంచే పోటీ చేస్తా..’ అని ఇటీవల బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రకటించేశారు. కానీ, బాలినేని శ్రీనివాస్ రెడ్డికి చివరి నిమిషంలో అయినా ‘సీటు మార్పు’ తప్పదంటూ వైసీపీలో చర్చ జరుగుతోంది.
ఈ క్రమంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఒకింత గుస్సా అవుతున్నారట. అటు వైసీపీలోనూ బాలినేని శ్రీనివాస్ రెడ్డి విషయమై ‘నమ్మకం సన్నగిల్లుతున్న’ పరిస్థితి కనిపిస్తోంది. అటు పార్టీకీ, ఇటు బాలినేనికి.. ఇద్దరికీ ఒకరిపై ఒకరికి నమ్మకం లేని పరిస్థితి రావడంపై వైసీపీ శ్రేణుల్లో అనూహ్యమైన గందరగోళం చోటు చేసుకుంది.
రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. బాలినేని శ్రీనివాస్ రెడ్డిని తమవైపుకు తిప్పుకోవాలని తెరవెనుక జనసేన గట్టి ప్రయత్నాలే చేస్తోంది. జనసేన ముఖ్య నేతలు, బాలినేని శ్రీనివాస్ రెడ్డితో సంప్రదింపులు జరిపారన్న సమాచారం వైసీపీ అధినాయకత్వం వద్ద కూడా వున్నట్లు తెలుస్తోంది.
ఏమో, బాలినేని వ్యవహారం ఏమవుతుందోగానీ, వైసీపీ అధినేత వైఎస్ జగన్.. బాలినేని విషయమై ఇప్పటికే ‘నిర్ణయం’ తీసేసుకున్నారంటూ కొత్త వాదన తెరపైకొస్తుండడం గమనార్హం.