YS Jagan: జగన్ అంతరంగం ఏమిటో బయటపడ్డది. చెల్లికి తల్లికి వాటా చెల్లించకుండా కేసులు వేసిన ఘనుడు.. ప్రజలకు మేలు చేస్తాడని, చేశాడని అనుకోవడం భ్రమే అవుతుంది. నీకింత.. నాకింత అన్న చందంగా ఐదేళ్లు రాష్టాన్న్రి అధోగతి పాలు చేసిన జగన్ ఓ మంచి నేతగా మాత్రం నిరూపించుకోలేక పోయారు. అందివచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశంతో ఎపిని దేశంలోనే అగ్రభాగానా నిలిపే అవకాశం వచ్చినా వదులుకున్నారు. ఐదేళ్లలో పోలవరం పూర్తి చేయలేదు.
రాజధాని అన్నది లేకుండా చేశారు. అభివృద్ది అన్నది లేకుండ ఆచేశారు. బటన్ నొక్కుడే అభివృద్ది అని భ్రమింప చేశారు. విశాఖలో రాజసౌధాలు నిర్మించుకున్నారు. తానే మళ్లీ ముఖ్యమంత్రి అయి.. అందులో విలాసాలు సాగించాలని అనుకున్నారు. ఇలా చెప్పకుంటూ పోతే అనేకం ఉన్నాయి. ప్రజలను ఓటింగ్ యంత్రాలుగా గుర్తించి వారికి తాయిలాలు పంచి, వారినుంచి ఓట్లు పొందాలని చూశారు. కానీ ప్రజలు జగన్ నైజాన్ని గమనించి గట్టిగా బుద్ది చెప్పారు. ఇంతటి వికృత ప్రవర్తన కలిగిన వ్యక్తి.. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును భ్రష్టు పట్టించారు.
తండ్రిలా జగన్ ఏనాడూ ప్రజల గురించి ఆలోచించలేదు. ప్రజలను దూరం పెట్టారు. ఇప్పుడు అధికారం పోగానే నా ప్రజలో అంటూ పొలోమని పోవడం..పరామర్శించడం మాత్రం నేర్చుకున్నారు. ఇలా నమ్మిన ప్రజలే జగన్‌ను గద్దె నెక్కించిన పాపానికి ఐదేళ్లపాటు అష్టకష్టాలు అనుభవించారు. రాజధాని లేకుండా పోయింది. అడుగు మేర రోడ్డు కూడా పడలేదు. లిక్కర్, ఇసుక, భూముల దోపిడీ జరిగింది. ఈ విషయంలో ఎంత చెప్పుకున్నా తక్కువే.
ఇంతలా విపరీత ప్రవర్తన ఉన్న జగన్ తన చిన్నాన్న మర్డర్ కేసును తేల్చాలని ఏనాడూ భావించలేదు. ఇప్పుడు కుటుంబానికి న్యాయం చేయడానికి ముందుకు రావడం లేదు. అందుకే జగన్ చుట్టూ ఇలాంటి వారే చేరారు. మాట తప్పను.. మడమ తిప్పను అని పదేపదే చెప్పే వైకాపా అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తన సొంత కుటుంబంలోని తల్లి, చెల్లి విషయంలోనే మాట తప్పి, మడమ తిప్పారు. ప్రేమతో చెల్లికి ఆస్తులు ఇస్తానని అవగాహన ఒప్పందం కుదుర్చుకుని మరీ ఇప్పుడు తూచ్ ఇవ్వనుపో అన్నారు.
రాజకీయంగా విభేదించారన్న కారణంగా తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలపై ఏకంగా కోర్టుకెక్కారు. షర్మిల రాజకీయంగా, వ్యక్తిగతంగా ఆరోపణలు చేసి తన పరువు, ప్రతిష్ఠలను దెబ్బతీశారని, ఆమెకు తనపై ప్రేమ లేదని తేలిందని, అందువల్ల చెల్లికి ఇచ్చిన గిప్ట్‌డీడ్‌ను రద్దు చేసుకుంటున్నానని వెల్లడిరచారు. ఆమెను దూరం పెట్టిందే జగన్. ఆమెను రాజకీయంగా దూరం చేసి, ఏకాకిని చేసిన తరవాతనే షర్మిల తెలంగాణలో కాలు మోపారు. తల్లిని పార్టీ బాధ్యతల నుంచి దూరం చేశారు. ఇవన్నీ కూడా కావాలనే చేసిన జగన్ ఇప్పుడు ఆస్తుల విషయంలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తారని అనుకోవడం మనదే తప్పు.
జగన్ ప్రజల ఆస్తులనే తనవిగా చేసుకున్న తీరును గత ఐదేళ్లలో చూశాం. ఎపిని 50 ఏళ్లపాటు వెనక్కి నెట్టారు. ఫ్యూడల్ మనస్తత్వంతో పాలన చేసే వారికి తరతమ భేదాలు ఉండవు. అందుకే ఇప్పుడు ఇంట్లోనూ వాటాలు, ఆస్తుల గొడవలు సృష్టించారు. ఇలాంటి వారు ఎంతకైనా తెగిస్తారని షర్మిల అంటూనే ఉన్నారు. ప్రేమానుబంధాలతో ఆస్తుల్లో వాటా ఇచ్చారన్న కృతజ్ఞత లేకుండా షర్మిల తనకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టిందని జగన్, భారతిలు పేర్కొన్నారు. అంతేగాకుండా అవాస్తవాలు, తప్పుడు ప్రకటనలు చేశారని పేర్కొన్నారు.ఈ చర్యలు తనను రాజకీయంగా వ్యతిరేకించడంతోపాటు వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీశాయన్నారు.
అంతేగాకుండా అన్నాచెల్లెళ్ల అనుబంధంపై ప్రభావం చూపి ప్రేమ, అనుబంధాలను తగ్గించేలా చేశాయన్నారు. రాజకీయ ప్రేరేపితు రాలైన చెల్లి వ్యక్తిగతంగాను బురద చల్లారని, దీంతో ఆవేదనకు గురైన తాను తమ మధ్య ఎలాంటి ప్రేమ మిగలలేదని గుర్తించినట్లు తెలిపారు. అందుకే చెల్లికి ఇవ్వాలన్న వాటాలు ఇవ్వడానికి చేసిన అవగాహన ఒప్పందం, తల్లికి గిప్ట్‌డీడ్ అమలు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. షర్మిల దురుద్దేశపూరిత చర్యల ద్వారా వాటాల బదలాయింపు అక్రమంగా జరిగాయని పేర్కొన్నారు. నిజమే రేపు..ఓటర్లు కూడా తమకు ఓటేయలేదని వారికి ఎలాంటి ప్రయోజనాలు కల్పించబోనని కూడా జగన్ చెప్పే ఆస్కారం ఉంది. జగన్ ప్రవర్తనను గుర్తించి ఓటర్లు ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఉండాలి. తన ప్రయోజనాలకు భిన్నంగా ఉండే ఎవరిని కూడా జగన్ క్షమించరు.
వారు కుటుంబ సభ్యులైనా, రాజకీయ నేతలైనా, ప్రజలైనా జగన్‌కు ఒక్కటే. ఐదేళ్ల పాలనలో ఇదే అనుసరించారు. ఇప్పుడు కుటుంబంలో అనుసరిస్తున్నారు. చెల్లి షర్మిలకు ఆస్తి పంపకాల్లో భాగం ఇవ్వడానికి కుదిరిన ఒప్పందంలో భాగంగా ట్రస్టీగా తల్లి విజయమ్మ పేరుతో గిప్ట్‌డీడ్ చేసిన జగన్ ఇప్పుడు దాన్ని రద్దు చేసుకుంటానంటున్నారు. గిప్ట్‌డీడ్‌లో పేర్కొన్న ఆస్తులను ఆటంకాలు లేకుండా అనుభవించవచ్చని, ఇందులో దాతతోపాటు ఎవరూ జోక్యం చేసుకోరనేది ఒప్పందంలో కీలకాంశం.
అయితే తనతో సహా ఎవరూ ఆస్తి పంపకాల్లో జోక్యం చేసుకోరని హావిూ ఇచ్చాక దానికి విరుద్ధంగా రద్దు చేసుకోవడం చెల్లదని న్యాయనిపుణులు చెబుతున్నారు. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సంపాదించిన ఆస్తుల్లో తనకు, తన పిల్లలకు దక్కాల్సిన వాటా ఇవ్వకుండా.. సోదరుడు జగన్ అన్యాయం చేశారని మరోవైపు వైఎస్ షర్మిల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అరకొర ఆస్తులిచ్చి వెళ్లగొట్టాలని చూడటమే కాకుండా, ఆస్తుల పంపకానికి సంబంధించి తనతో చేసుకున్న ఒప్పందాన్ని కూడా తుంగలో తొక్కారని మండిపడ్డారు.
తల్లిపైనా, చెల్లిపైనా కేసు పెట్టి, కుటుంబాన్ని కోర్టుకీడ్చేంత నీచానికి ఒడిగట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తుల విషయం సెటిల్ చేసుకోవాలంటే.. జగన్‌కు, అవినాష్‌రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడకూడదని తనకు షరతు పెట్టడంపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. మొత్తంగా జగన్ ఆస్తుల గొడవ కారణంగా ఆయన మనస్తత్వం ప్రజలకు అర్థం అయివుండాలి. ఐదేళ్లుగా అనుభవంలోకి వచ్చి ఉండాలి. అందువల్ల ఎపి ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే. జగన్ లాంటి నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రాజకీయాల్లో త్యాగాలు చేయని వారిని కూడా ప్రజలు ఆదరించరాదు.