ఎన్నికలు సమీపిస్తున్న వేళ టిక్కెట్లు ఆశిస్తున్న అభ్యర్థులు పార్టీ నిర్ణయాలతోనూ, పొత్తుల పంచాయతీలతోనూ సంబంధం లేకుండా వారి వారి ప్రచార కార్యక్రమాలు వారు మొదలుపెట్టేసుకుంటున్నారు. పొత్తులో టిక్కెట్ పోతే రెబల్ గా అయినా పోటీకి సిద్ధం అన్నట్లుగా ముందుకు కదులుతున్నారు. ఈ క్రమంలో ఏపీలో రెండు మూడు రకాల పొత్తులపై చర్చ జరుగుతున్న వేళ విశాఖ ఉత్తరం టిక్కెట్ ఎవరికి కన్ ఫాం అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా ఉంది!
ఏపీలో ఇప్పుడు పొత్తులపై రెండు మూడు రకాల చర్చలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా.. టీడీపీ – జనసేన, టీడీపీ – జనసేన – బీజేపీ, జనసేన – బీజేపీ.. ప్రస్తుతం బలంగా ఈ మూడు పొత్తులపైనా చర్చ జరగనుంది. వీటిలో ఏ పొత్తు ఫైనల్ అయ్యేది అనేది ప్రధానంగా జనసేనపై ఆధారపడి ఉందనే అనుకోవాలి! ఈ క్రమంలో ఇప్పటికే టీడీపీ – జనసేన మధ్య సీట్ల సర్ధుబాటు వ్యవహారాలు చర్చనీయాంశం అవుతున్నాయి.
ఈ సమయంలో ఎవరితో ఎవరు పొత్తు పెట్టుకున్నా… విశాఖ ఉత్తరం నుంచి పోటీచేసేది తానే అంటూ బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఫిక్సయినట్లు కనిపిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా పూజా కార్యక్రమాలు ముగించుకుని, ప్రచారం షురూ చేశారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి తాను బరిలోకి దిగుతున్నట్లు కార్యకర్తలను, అనుచరులను ఉత్సాహపరుస్తున్నారు.
వాస్తవానికి… బీజేపీ – టీడీపీ కలవాలని విష్ణుకుమార్ రాజు మొత్తుకుంటున్నారు. ఇప్పుడు జనసేన కూడా నేరుగా కలిసింది కాబట్టి 2014 ఫలితాలు రిపీట్ అయ్యే అవకాశం ఉందనేది ఆయన అభిప్రాయం! అయితే ఈ విషయంలో బీజేపీ పెద్దలు ఏమీ తేల్చడం లేదు. తాజాగా పవన్ కు హస్తిన నుంచి కబురు పెట్టారని మాత్రం తెలుస్తుంది. దీంతో… ఇంకా వేచి చూస్తే లాభం లేదని తానే అభ్యర్ధిని అని ప్రకటించుకుని రంగంలోకి దిగిపోయారు విష్ణుకుమార్ రాజు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… బీజేపీ ఎవరితో పొత్తు పెట్టుకున్నా విష్ణుకుమార్ రాజుకు టిక్కెట్ విషయంలో గట్టిపోటీ అయితే తప్పకుండా ఉంటుంది. ఇందులో భాగంగా టీడీపీతో బీజేపీ పొత్తుపెట్టుకుంటే… టీడీపీ నుంచి గంటా శ్రీనివాస్ రావు రెడీగా ఉండగా… పొత్తులో భాగంగా ఆ సీటు తమకే కేటాయించాలని జనసేన కూడా గట్టిగా పట్టుబడుతుంది. ఈ విషయం ముందే పసిగట్టారో ఏమో కానీ… ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టి రంగంలోకి దిగిపోయారు విష్ణుకుమార్ రాజు.
కాగా… 2014లో టీడీపీ – బీజేపీ – జనసేన పొత్తులో భాగంగా విశాఖ నార్త్ నుంచి పోటీచేసిన విష్ణుకుమార్ రాజు 18,240 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి వెంకట రావుపై గెలుపొందారు. ఇదే క్రమంలో 2019లోనూ టిక్కెట్ దక్కించుకున్న ఆయన… 18,790 ఓట్లు మాత్రమే సాధించుకుని నాలుగో స్థానానికి పరిమితమయ్యారు.