ప్రస్తుతం బీజేపీతో కాపురం చేస్తూ టీడీపీపై మనసుపడుతున్న నేతలకు లోటు లేదు. దేశవ్యాప్తంగా రోజు రోజుకీ బీజేపీకి వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయని నమ్ముతున్న ఏపీ బీజేపీ నేతలు… ప్రత్యామ్నాయంగా టీడీపీలో చేరిపోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. అందులో భాగంగా ఆ పార్టీని అనుకూలంగా ఉన్న టీవీ ఛానల్స్ లో ఇంటర్యూలు ఇస్తూ జగన్ ని తిట్టిపోస్తున్నారు. చంద్రబాబుని పొగడటానికి మనసురాకో ఏమో కానీ… జగన్ ని తిట్టడంపై తాము చంద్రబాబుకు మద్దతు పలుకుతున్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వీరిలో ప్రస్తుతం విష్ణుకుమార్ రాజు ముందుకివచ్చారు.
విశాఖ ఉత్తర నియోజకవర్గ బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు మనసంతా టీడీపీ పైనే ఉంది. పైకి టీడీపీ బీజేపీలు కలవాలని చెబుతున్నా.. అవి కలవవని తెలిసినా.. అదేపాట పాడుతూ సైకిల్ పై మనసుపడుతున్న విషయాన్ని చెప్పకనే చెబుతున్నారు. అయితే… ఈ విషయంలో విష్ణు కుమార్ తొందరపడ్డారనే విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. అందుకు కారణం… అక్కడ టీడీపీ నేత గంటా శ్రీనివాస రావు. ఆయన కూడా ఇదే నియోజకవర్గం నుంచి సీనియర్ నేతగా టీడీపీలో కీలకంగా ఉన్నారు.
విశాఖ ఉత్తర నియోజకవర్గంలో గంటా శ్రీనివాస్ ను కాదని చంద్రబాబు కూడా ఏమీ చేయలేని పరిస్థితి అంటారు. పైగా నిన్నమొన్నటి వరకూ రాజకీయాలకూ, పార్టీకి దూరంగా ఉన్నట్లు కనిపించిన ఆయన… తాజా పట్టబద్రుల ఎమ్మెల్సీ టైం నుంచి ఫుల్ యాక్టివ్ అయిపోయారు. దీంతో.. ప్రస్తుతం ఆయన మాటను చంద్రబాబు కాదనలేరు. ఇదే సమయంలో… విష్ణుకి మరో దారుందని అంటున్నరు ఆయన ఫ్యాన్స్.
విష్ణుకు ఉన్న ఆ రెండో దారి… జనసేనలో చేరిపోవడం. అవును… విష్ణు కుమార్ రాజు జనసేనలో చేరిపోయి, పొత్తులో భాగంగా ఆ సీటును బలంగా కోరుకోవచ్చు. అది పవన్ తో సాధ్యమవ్వొచ్చు కూడా. కానీ.. జనసేన నాయకులతో కూడా గంటాకు మంచి పరిచయాలే ఉన్నాయి. అవి ఆర్ధిక సంబంధమైన పరిచయాలా, సామాజికవర్గ సంబంధ పరిచయాలా అన్నసంగతి కాసేపు పక్కనపెడితే… గంటాను కాదని జనసేన కూడా విష్ణుకు ఆ సీటివ్వదు. ఇక బీజేపీ ఇప్పటికే ఆయనకు షోకాజ్ నోటీసుకూడా ఇచ్చేసింది. దీంతో… విష్ణు కాస్త తొందరపడి.. రెంటికీ చెడ్డ రేవడి అయిపోయారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.