Mrunal Thakur: ‘స్పీరిట్‌’లో మృణాల్‌..!

అరంగేట్రం చేసిన అనతికాలంలోనే తెలుగులో మంచి గుర్తింపును సంపాదించుకుంది మరాఠీ భామ మృణల్‌ ఠాకూర్‌. సీతారామం, హాయ్‌ నాన్న చిత్రాల్లో ఈ భామ అభినయానికి ప్రశంసలు లభించాయి. ప్రస్తుతం మృణాల్‌ ఠాకూర్‌ హిందీ సినిమాలపై ఎక్కువ దృష్టి పెట్టింది. అక్కడ నాలుగు ప్రాజెక్ట్స్‌లో నటిస్తూ బిజీగా ఉంది. తాజా సమాచారం ప్రకారం ఈ భామ తెలుగులో బంపరాఫర్‌ను దక్కించుకున్నట్లు తెలిసింది. ప్రభాస్‌ ‘స్పిరిట్‌’ చిత్రంలో ఆమె కథానాయికగా నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి.

సందీప్‌రెడ్డి వంగా డైరెక్ట్‌ చేయబోతున్న ‘స్పిరిట్‌’ మూవీ ఇప్పటికే పాన్‌ ఇండియా స్థాయిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ‘యానిమల్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తర్వాత సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా ఇదే కావడంతో భారీ అంచనాలేర్పడ్డాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్‌ దశలో ఉంది. జనవరిలో షూటింగ్‌ మొదలుకానున్నట్లు సమాచారం.

ఈ సినిమాలో కథానాయికగా మృణాల్‌ ఠాకూర్‌ ఖరారయ్యే అవకాశాలున్నాయని ముంబయి సినీ సర్కిల్స్‌లో వార్తలొస్తున్నాయి. ఇదే గనుక నిజమైతే మృణాల్‌ ఠాకూర్‌ కెరీర్‌లోనే ఇదే అతిపెద్ద ఆఫర్‌ అవుతుందని ట్రేడ్‌ వర్గాలు అంటున్నాయి.